Breaking News

విశాఖ త్రాగు, పారిశ్రామిక నీటి అవసరాలపై సిఎం సమగ్ర సమీక్ష.

-సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో విశాఖకు తాగునీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక.
-ఏలేరు కెనాల్ సామర్ద్యాన్ని 350 క్యూసెక్కులకు పెంచాలని సిఎం ఆదేశించారు.
-23న విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులతో మరో మారు సమావేశం.
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళిక రూపొందించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖ భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ, చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు.

విశాఖ తాగునీటి అవసరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇరిగేషన్, పురపాలక శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత నీటి వనరుల లభ్యత, నిల్వలు, పరిమితులు, ప్రత్యామ్నాయ మార్గాలు, పైప్‌లైన్లు, లిఫ్ట్‌ల ద్వారా నీటిని అందించే అవకాశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

ఏలేరు–కణితి ద్వారా తాగునీటికి భరోసా

కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఏలేరు నుంచి ప్రస్తుతం రోజుకు 300 క్యూసెక్కుల నీరు అందుతోందని మంత్రి తెలిపారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయగలుగుతున్నామని చెప్పారు. ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 10.2 టీఎంసీల నీరు ఉండగా, అందులో 6.1 టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా ఉందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్కుల నీటిని ప్రణాళికాబద్ధంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఏలేరు నుంచి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వస్తున్న నీటిని 300 నుంచి 350 క్యూసెక్కులకు పెంచే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏలేరు డెడ్ స్టోరేజీలోని నీటిని కూడా వినియోగించుకునేలా మోటార్లు, పంపులను ముందుగానే సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

రైవాడకు ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి

విశాఖకు మరో ప్రధాన నీటి వనరైన రైవాడ రిజర్వాయర్ సామర్థ్యం 3.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. రైవాడ కింద ఉన్న సుమారు 5,000 ఎకరాల సాగును సమర్థవంతంగా నిర్వహిస్తూ, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారని చెప్పారు.

రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఎల్‌ఎంసీ 162వ కిలోమీటర్ వద్ద లేదా అనువైన ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి రైవాడకు నీరు అందించే ప్రతిపాదనలను వారం రోజుల్లో పరిశీలించాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

మేఘాద్రిగెడ్డకు 100 క్యూసెక్కుల నీరు

విశాఖకు మరో ముఖ్యమైన నీటి వనరైన మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ సామర్థ్యం 1.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 0.2 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి మేఘాద్రిగెడ్డకు 100 క్యూసెక్కుల నీటిని అందించే పైప్‌లైన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 10.5 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో 9 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మరో 1.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.

మిగిలిన పైప్‌లైన్ పనులతో పాటు మోటార్లు, పంపుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి మేఘాద్రిగెడ్డకు నీరు అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. రైల్వే, ఎలక్ట్రికల్ క్రాసింగ్‌ల వద్ద ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

తాటిపూడి నీటిని సమర్థవంతంగా వినియోగించాలి

తాటిపూడి రిజర్వాయర్ సామర్థ్యం 3.3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 1.2 నుంచి 1.26 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. తాటిపూడి నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు విజయనగరం సాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారని చెప్పారు. తక్కువ నీటితో పంటలు సాగు చేసే విధానాలను అవలంబించాలని, సాగునీటి వినియోగాన్ని పర్యవేక్షించాలని విజయనగరం కలెక్టర్‌ను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

పురుషోత్తపట్నం లిఫ్ట్ చంద్రబాబు ముందుచూపుకు నిదర్శనం

విశాఖ తాగునీటి అవసరాల్లో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి అన్నారు. స్థానిక వర్షాలపై ఆధారపడే రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరును నింపడం వల్లే ప్రస్తుతం విశాఖకు కీలకమైన నీటి సరఫరా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా అప్పట్లో పురుషోత్తపట్నం లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడం చంద్రబాబు ముందుచూపుకు నిదర్శనమన్నారు. గతంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను విమర్శించిన వారు, నేడు వాటి ప్రయోజనాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించడంతో శ్రీశైలం నీటిని రాయలసీమ, నాగార్జునసాగర్ తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. అదేవిధంగా పురుషోత్తపట్నం ద్వారా ఏలేరును నింపడం వల్ల సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో కూడా విశాఖ తాగునీటికి భరోసా ఏర్పడిందన్నారు.

పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

2027లో పోలవరం పూర్తయిన వెంటనే పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. పోలవరం పూర్తయి ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్రకు గోదావరి జలాల ప్రయోజనం మరింత ముందుగానే అందేదని మంత్రి అన్నారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యం వల్ల ఉత్తరాంధ్రకు నీటి ప్రయోజనాలు ఆలస్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

డేటా సెంటర్లపై తప్పుడు ప్రచారం వద్దు

రాబోయే డేటా సెంటర్లకు అవసరమైన నీటి పరిమాణంపై కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి అన్నారు. విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలను సమతుల్యం చేస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దీర్ఘకాలిక దృష్టి

భవిష్యత్తులో విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శాశ్వత పరిష్కారం కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి తెలిపారు. గ్రావిటీ ద్వారా విశాఖకు నీటిని అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

సెప్టెంబర్ 23న మరోసారి సమీక్ష

సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విశాఖకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 23న విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులతో మరోసారి సమావేశమై విశాఖకు శాశ్వత తాగునీటి పరిష్కారంపై చర్చించనున్నట్లు తెలిపారు. విశాఖ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *