-రాష్ట్రాల అభివృద్ధి, వనరుల సమీకరణపై కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు నిపుణులతో అత్యున్నత స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్.
-వ్యవసాయ, ఎనర్జీ రంగాల్లో సవాళ్లు – ప్రైవేట్ భాగస్వామ్యంపై విస్తృత చర్చ.
-త్వరలో మదనపల్లెలో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రారంభం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
‘విజన్ 2047’ లక్ష్యాల సాధన కోసం దేశంలోనూ, వివిధ రాష్ట్రాలు తమ లక్ష్యాలను ఏ విధంగా నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులను ఏ రకంగా సమీకరించుకోవాలి అనే అంశాలపై కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు నిపుణులతో అత్యున్నత స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్ జరిగినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా, భవిష్యత్ అవసరాల కోసం అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే కోణంలో ఈ సదస్సు ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కేంద్ర ఆర్థిక శాఖ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, ప్రైవేట్ రంగ నిపుణులు, ఆర్థిక వేత్తలు, రిటైర్డ్ సీనియర్ బ్యూరోక్రాట్లతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది ఒక గొప్ప శుభపరిణామమని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధానంగా కీలక రంగాలపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో ఉన్న సవాళ్లు, ఆ రంగానికి కావలసిన పెట్టుబడులు, క్రెడిట్ ఫెసిలిటీస్, వాటర్ ఇంటిగ్రేషన్, రైతులకు ఎదురయ్యే క్లైమేట్ మార్పుల రిస్క్‌లను తగ్గించడం వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అలాగే ఎనర్జీ రంగంలో అవకాశాలు, పబ్లిక్-ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యాన్ని పెంచడంపై టాటా గ్రూప్, కోటక్ గ్రూప్ నిపుణులు, మాజీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ల సలహాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో విజయవంతమైన ప్రయోగాలను ఇక్కడ చర్చించామని, ఇది కేంద్రానికి, రాష్ట్రాలకు మరియు సమాజానికి భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో హార్టికల్చర్ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో మదనపల్లెలో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా ఆహ్వానించడం జరిగిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు కానున్నాయని చెప్పారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై స్పందిస్తూ.. ఈసారి ఎల్నినో ప్రభావం దక్షిణ భారతదేశంలో చాలా తీవ్రంగా ఉందని, దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముందుగా ఉన్న పంటలను కాపాడుకోవడం, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్‌లో వివరించారు.
Prajavartha Online Telugu News