-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. జోనల్ కమిషనర్లతో పాటు సర్కిల్ స్థాయిలోని అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సమస్యకు తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం కార్యాలయ స్థాయిలో పరిశీలించకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. నగరంలో ప్రతిరోజూ ఎక్కడెక్కడ డీసిల్టింగ్ ప్రక్రియ జరుగుతుందో వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త కుప్పలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, పారిశుద్ధ్య కార్మికుల ద్వారా చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, సమస్య స్వభావాన్ని బట్టి అత్యంత త్వరగా పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిగణించి, సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 26 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన 10 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 8, ఎస్టేట్ 1, రెవెన్యూ శాఖకు 3, యూసిడి విభాగానికి 3, ఉద్యానవనం శాఖకు సంబంధించి 1 అందినట్లు కమిషనర్‌కు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె. దుష్యంత్, ఎక్సమినేర్ ఈఫ్ అకౌంట్స్ ఎస్. ఎన్. చక్రవర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News