అర్జీల పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపాలి

-గడువులోగా పరిష్కారంతో పాటు నాణ్యతకూ పెద్దపీట వేయాలి
-అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేదు
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, ప్రతి అర్జీకి నాణ్యమైన, న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజా సంతృప్తిని ప్రధాన ప్రమాణంగా తీసుకుని, గ్రీవెన్స్‌ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితర అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి అందిన అర్జీని కేవలం రికార్డుల్లో పరిష్కరించినట్లు చూపించడం కాకుండా, అర్జీదారుని సమస్య వాస్తవంగా పరిష్కరించబడిందా? అర్జీదారు ఆ పరిష్కారంతో సంతృప్తి చెందారా? అనే అంశాలే అర్జీ పరిష్కారానికి అసలు గీటురాయిగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీ పరిష్కార ప్రక్రియలో అధికారులు కేవలం కార్యాలయాల్లో ఫైళ్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితర అధికారులు అర్జీలపై సమగ్రంగా విచారణ చేపట్టి, అవసరమైతే సంబంధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులు, నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి అర్జీకి నిర్దేశించిన గడువును అధికారులు తప్పనిసరిగా పాటించాలని, గడువులోగా పరిష్కారం సాధ్యంకాని సందర్భాల్లో అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. అర్జీ పరిష్కార ప్రక్రియలో వేగంతో పాటు పరిష్కార నాణ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీల పరిష్కారం అనంతరం అర్జీదారుల నుంచి అందే ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌ను కూడా అధికారులు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయి, ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్, పరిష్కార నాణ్యత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అర్జీల పరిష్కారాన్ని నిరంతరం సమీక్షించాలని అన్నారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే అర్జీలు సమర్పించాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పునరావృతమవుతున్న సమస్యలను గుర్తించి వాటికి మూలకారణాలను పరిశీలించి, భవిష్యత్తులో అదే సమస్య తిరిగి ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, భూ సమస్యలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సమర్థవంతంగా పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన అంశమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వంపై నమ్మకంతో పీజీఆర్‌ఎస్‌ వేదికను ఆశ్రయిస్తున్నందున, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *