అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్,సియం కార్యదర్శి ఎవి రాజమౌళి గురజాడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.ఈసందర్భంగా సిఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ మహాకవి మరియు నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడంలో ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కం నాటకానిది ఒక ప్రత్యేకతని పేర్కొన్నారు.అనేక రచనల ద్వారా ఆనాటి సమాజంలో సాంఘిక పరివర్తనను తీసుకువచ్చేందుకు ఎనలేని కృషి చేశారని సిఎస్ ఈసందర్భంగా గుర్తు చేశారు.
ఈకార్యక్రమంలో సియం కార్యదర్శి ఎవి రాజమౌళి గురజాడ అపారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.అదే విధంగా ప్రాటోకాల్ విభాగం సంయుక్త కార్యదర్శి రామసుబ్బయ్య,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ,ఇతర అధికారులు,ఉద్యోగులు గురజాడ చిత్రపటానికి పుష్పాంజల ఘటించి నివాళులు అర్పించారు.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా యస్.రాయవరంలో 1862 సెప్టెంబరు 21న వెంకట రామదాసు,కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.గురజాడ 19వ శతాబ్దంలోను,20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయి.అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు.కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు.గురజాడ కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వెళ్ళింది.అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజరుగా, ఖిలేదారు గానూ పని చేసాడు.తన 10వ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువగా వారి తండ్రి కాలం చెయ్యటంతో విజయనగరానికి వచ్చారు.అక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించాడు.ఆ సమయంలో అప్పటి ఎమ్.ఆర్.కళాశాల ప్రధానాధ్యాపకులు సి.చంద్రశేఖర శాస్త్రి అప్పారావును చేరదీసి ఉండడానికి చోటిచ్చాడు.1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి 1884లో ఎఫ్.ఎ చేసి అదే సంవత్సరంలో ఏం.ఆర్.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు.విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనుకు సహాధ్యాయి వారిద్దరూ ప్రాణస్నేహితులు.గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు.ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం,వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు.1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది.1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది.గురజాడ అప్పారావు రచనల్లో పూర్ణమ్మనీలగిరి పాటలు,ముత్యాల సరాలు,సత్యవ్రతి శతకం,సుభద్ర,లంగరెత్తుము,కాసులు,దిద్దుబాటు వంటివి కొన్ని ముఖ్యమైన రచనలు.
Prajavartha Online Telugu News