విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“చెవి సమస్య ఏది వచ్చినా స్వయంగా చికిత్స చేసుకోవద్దు. చెవిలోకి వస్తువులు పెట్టవద్దు. వినికిడి మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రాధమిక దశలోనే వైద్యుడిని సంప్రదించండి. చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ బి.పవన్ కుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో “సాధారణ చెవి ఇన్ఫెక్షన్లు – సంరక్షణ” అంశంపై పై ప్రసంగించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చెవిలో బ్యాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చని, ముఖ్యంగా పిల్లల్లో జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ల తరువాత మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. చెవిలో నీరు చేరడం, చెవిలో గాయాలు కావడం, చెవిని శుభ్రం చేయడానికి కాటన్ బడ్స్, పిన్నులు, ఇతర వస్తువులను ఉపయోగించడం వంటి కారణాలతో బయటి చెవి ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చని తెలిపారు. చెవిలో ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు సాధారణంగా చెవి నొప్పి, దురద, చెవి నుంచి ద్రవం లేదా చీము రావడం, వినికిడి తగ్గడం, చెవిలో బరువుగా లేదా మూసుకుపోయినట్లు అనిపించడం, కొన్నిసార్లు జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్వయంగా మందులు, ముఖ్యంగా యాంటీబయాటిక్ చెవి చుక్కలు ఉపయోగించకూడదు. చెవి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన వైద్య చికిత్స పొందాలన్నారు. చిన్న పిల్లలు తమ సమస్యను చెప్పలేని పరిస్థితిలో చెవిని తరచూ పట్టుకోవడం, ఏడవడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి లక్షణాలను గమనించాలని సూచించారు. చెవిపోటు లేదా చెవి నుంచి స్రావం ఉన్నప్పుడు వైద్యుల సలహా లేకుండా చెవిలో నూనె, ఇతర ద్రవాలు లేదా ఇంటి చిట్కాలు ఉపయోగించడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈత కొట్టే సమయంలో చెవిలో నీరు ఎక్కువగా చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెవి తడిగా ఉంటే బయట భాగాన్ని మృదువైన వస్త్రంతో తుడవాలని సూచించారు. వినికిడి తగ్గడం, తీవ్రమైన చెవి నొప్పి, చెవి నుంచి రక్తం లేదా చీము రావడం, జ్వరం, తల తిరగడం, లేదా ఇన్ఫెక్షన్ పదేపదే రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, వినికిడి లోపం వారి మాటలు, భాష మరియు విద్యాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అవసరమైన పరీక్షలు చేయించాలని తెలిపారు. సదస్సుకు డాక్టర్ హరిహరన్ వందన సమర్పణ చేసారు. సదస్సులో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సందేహ నివృత్తి చేసారు.
Prajavartha Online Telugu News