విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఆధునిక కాలంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనేకమంది సరైన శారీరక కదలికలు లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నొప్పి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే, ముందుగానే సరైన జీవనశైలిని అలవర్చుకోవడం మంచిది. వెన్నెముకను కాపాడుకోవడం అంటే మన చలనశక్తిని, స్వతంత్ర జీవనాన్ని, జీవన నాణ్యతను కాపాడుకోవడమే” అని ప్రముఖ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ డాక్టర్ యు. భార్గవ రామ్ అన్నారు. అక్టోబర్ 16 ప్రపంచ వెన్నుముక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వాసవ్య నర్సింగ్ హోమ్ లో డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన “వెన్నెముక ఆరోగ్యం” అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో మొబైల్ ఫోన్లను తలవంచి ఎక్కువసేపు చూడటం, శారీరక శ్రమ తగ్గిపోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, బరువును సరైన పద్ధతిలో ఎత్తకపోవడం వంటి కారణాలు వెన్నెముక సమస్యలకు దారితీస్తున్నాయని వివరించారు. వయసు పెరగడం, డిస్కుల్లో అరుగుదల, కొన్ని సందర్భాల్లో గాయాలు, ఇతర శారీరక సమస్యల కారణంగా వెన్నెముకలో మార్పులు ఏర్పడవచ్చని చెప్పారు. ముఖ్యంగా డిస్కు బయటకు పొడుచుకురావడం లేదా నరాలపై ఒత్తిడి ఏర్పడడం వల్ల నడుమునొప్పితో పాటు కాళ్లలోకి నొప్పి వ్యాపించడం, తిమ్మిర్లు, మొద్దుబారడం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చని వివరించారు. స్లిప్ డిస్క్, సయాటికా, స్పైనల్ స్టెనోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, ఆస్టియోపోరోసిస్ వెన్నెముకలో సాధారణంగా కనిపించే సమస్యలు అన్నారు. వెన్నునొప్పి వచ్చిన వెంటనే శస్త్రచికిత్స అవసరమవుతుందనే అపోహ ప్రజల్లో ఉందని, వాస్తవానికి చాలామంది రోగులకు మందులు, ఫిజియోథెరపీ, తగిన వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులతో ఉపశమనం లభిస్తుందని తెలిపారు. అవసరాన్ని బట్టి ఎక్సరే, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా సమస్యను గుర్తించి తగిన చికిత్స నిర్ణయిస్తారని వివరించారు. ముఖ్యంగా మూత్రవిసర్జన లేదా మలవిసర్జనపై అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడం, రెండు కాళ్లలో బలహీనత, జననాంగాల చుట్టూ స్పర్శ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యసహాయం పొందాలని సూచించారు. వెన్నెముక శస్త్రచికిత్సలో ఇటీవల అభివృద్ధి చెందిన ఆధునిక పద్ధతుల్లో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఒకటన్నారు. ఈ విధానం వల్ల చుట్టుపక్కల కండరాలు, కణజాలాలకు కలిగే నష్టాన్ని తగ్గించడం, శస్త్రచికిత్స తర్వాత నొప్పిని తగ్గించి, త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రోగి పరిస్థితి, ఎంఆర్ఐ ఫలితాలు, నరాలపై ఒత్తిడి తీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యలను పరిశీలించిన తరువాతే సరైన చికిత్సా విధానాన్ని నిర్ణయించాలని స్పష్టం చేశారు. రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని డాక్టర్ భార్గవ రామ్ సూచించారు. సదస్సులో పాల్గొన్న అనేకమంది వెన్ను నొప్పి గురించి పలు ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు.
Prajavartha Online Telugu News