మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిమ్స్ మంగళగిరిలో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్య, పరిశోధనలకు విశేష సేవలందిస్తున్న స్వచ్ఛంద దేహదాతలకు నివాళులర్పించారు. దేహదాన స్మారక గోడను ప్రారంభించడంతో పాటు ఎనిమిది మంది దాతల కుటుంబాలను, 30 మంది కాబోయే దేహదాతలను సత్కరించారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎమెరిటస్ డా. వి. సుభద్ర దేవి వైద్య విద్యలో శరీర నిర్మాణ శాస్త్రం ప్రాధాన్యంపై ఉపన్యాసం ఇచ్చారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డా. అహంతేం శాంతా సింగ్, మెడికల్ సూపరింటెండెంట్ డా. రాజశేఖర్ మోహన్, డీన్ అకడమిక్స్ ప్రొఫెసర్ డా. దేశు రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య విద్యార్థుల శిక్షణ, వైద్య పరిశోధనల అభివృద్ధిలో స్వచ్ఛంద దేహదాతల సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. దేహదానం ద్వారా భవిష్యత్ వైద్య నిపుణులకు జ్ఞానాన్ని అందిస్తున్న దాతలకు, వారి కుటుంబాలకు ఎయిమ్స్ మంగళగిరి శరీర నిర్మాణ శాస్త్ర విభాగం కృతజ్ఞతలు తెలిపింది.
Prajavartha Online Telugu News