సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సీతానగరంలోని శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో గురువారం శ్రీ జయలక్ష్మీ అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చన, శ్రీయాగం నిర్వహించారు.
ఉదయం 9 గంటలకు అభిషేకం, కుంకుమార్చన, 10 గంటలకు శ్రీయాగం శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకిసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం తీర్థప్రసాద గోష్ఠి జరగగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయప్రాప్తి, ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబ సుఖశాంతులు, సర్వశుభాలు కలగాలని జయలక్ష్మీ అమ్మవారిని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News