-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత స్థాయిలో తాగునీరు, ఆహార పదార్థాలు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి స్వచ్ఛమైన తాగునీటిని విస్తృతంగా అందిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా 2026 అక్టోబర్ 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 25 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కేవలం మూలా నక్షత్రం రోజైన అక్టోబర్ 16వ తేదీన ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 3.5 లక్షల వాటర్ బాటిళ్లను భక్తులకు పంపిణీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే హోల్డింగ్ ఏరియాల్లో ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బిస్కెట్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
లక్షలాది మంది భక్తులు ఒకేసారి నగరానికి తరలివచ్చే నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కమిషనర్ తెలిపారు. భక్తులు సంచరించే మార్గాలు, హోల్డింగ్ ఏరియాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపడుతూ, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. పారిశుధ్య సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ పరిసరాల పరిశుభ్రతను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తాగునీరు, అవసరమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రమైన పరిసరాలు, ఇతర మౌలిక వసతులు సమకూర్చడం ద్వారా వారి యాత్ర సౌకర్యవంతంగా సాగేలా విజయవాడ నగరపాలక సంస్థ సమన్వయంతో సేవలందిస్తోందని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News