Breaking News

మే9న చలో అమరావతి… : సీపీఐ కె.రామకృష్ణ

-రాష్ట్రంలో పన్నులు, ధరలు అన్నీ అధికమే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడబలుక్కుని పదేపదే ధరలు, పన్నులు పెంచుతూ ప్రజలను హింసిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అధిక ధరలను అరికట్టాలని కోరుతూ మే 9న చలో అమరావతి పేరుతో రాష్ట్ర సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, సిమెంట్‌, ఇనుము, ఇసుక ధరలు, విద్యుత్‌, బస్‌ చార్జీలు పెరిగి అల్లాడుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎపీలో పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆస్తి పన్నును 15 శాతం మాత్రమే పెంచుతామని గత ఏడాది మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని, ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం 32 శాతానికి పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీజిల్‌ సెస్‌ పేరుతో రూ.720 కోట్ల భారాన్ని ప్రయాణికులపై మోపారన్నారు. విద్యుత్‌ చార్జీలు 7 సార్లు భారీగా పెంచినా కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. మళ్లీ ట్రూఅప్‌ చార్జీల పేరుతో ఆగస్టు నుంచి మరో రూ.3 వేల కోట్ల వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా అదానీతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాలూచీ పడి కమీషన్ల కోసం 9 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.49 చొప్పున 25 ఏళ్లు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.1.99లకు లభిస్తున్నప్పటికీ రాజస్థాన్‌లో ఉత్పత్తి చేస్తున్న అదానీ కంపెనీ నుంచి ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారనే విషయంపై ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదానీ కంపెనీతో ఒప్పందం వల్ల ప్రజలపై 25 ఏళ్లపాటు రూ.22,500 కోట్ల భారం పడనుందని ఆందోళన వ్యక్తంచేశారు.

అసంతృప్తిని రాష్ట్రాలపైకి మళ్లించేందుకు మోదీ కుట్ర
పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంపై ప్రజల ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి మళ్లించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాయమాటలు చెబుతున్నారని రామకృష్ణ విమర్శించారు. తాము నవంబర్‌లో డీజిల్‌, పెట్రోల్‌ ధర తగ్గించామని, రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించడం లేదని మోదీ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పైసా కూడా ధరలు పెంచకుండా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచలేదా.. అని ప్రశ్నించారు. ధరలు తగ్గించడానికి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోకుండా రాష్ట్రాలపైకి తప్పును నెట్టివేసేలా వ్యవహరించడం తగదన్నారు.

కేటీఆర్‌ మాటలతో ఉలుకు ఎందుకు?
రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఉన్నాయని, రోడ్లు అధ్వానంగా మారాయని తాము చాలారోజులుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని రామకృష్ణ అన్నారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో ‘అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు..’ అన్న చందంగా మంత్రులు సిగ్గులేకుండా తీవ్రంగా స్పందించారని విమర్శించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్‌ కాలేదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని, అయితే ఎందుకు ఏడుగురిని అరెస్టు చేశారని రామకృష్ణ ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వం దోపిడీపై మాత్రమే దృష్టి పెట్టిందని, మరేపనిపైనా శ్రద్ధ చూపడంలేదని, అందువల్లే ఇటువంటివి జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న దోపిడీ విధానాలు, ధరలు, పన్నుల భారాలను తాము చూస్తూ ఊరుకోబోమని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తీరుతామని స్పష్టంచేశారు. మే 9వ తేదీన చలో సచివాలయం కార్యక్రమానికి 26 జిల్లాల నుంచి సీపీఐ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తమను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తొలుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు రావుల వెంకయ్యతో కలిసి రామకృష్ణ చలో సచివాలయం కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *