గాయక ఆణిముత్యం జి. ఆనంద్…


-ప్రథమ వర్ధంతి సభలో పలువురు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆణిముత్యాలను అందించిన ఘనత జి ఆనంద్ అని, ఆయన ఎందరో వర్ధమాన గాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. సినీ వినీలాకాశంలో సుస్వారాలను మధురంగా అందించిన సుమధుర గాయకుడుగా ఆనంద్ నిలిచిపోయారని అన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు అధ్యక్షతన విజయవాడ న్యూస్ పేపర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఆయన ప్రథమ వర్ధంతి సభలో అంబటి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. మంచి మనీషి, సహృదయుడు, స్నేహశీలి అయిన జీ ఆనంద్ కోవిడ్ మహమ్మారిలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఎందరో వర్ధమాన గాయకులను తయారు చేసిన జి ఆనంద్ మన మధ్యలేకపోవడం ఎంతో విచారకరమన్నారు. సినీరంగంలో ఎందరో నేపధ్య గాయకులను తయారు చేసి వారికి ఉపాధి కల్పించిన ఘనత ఆయకే దక్కుతుందని ఆయన సేవలను కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా తులగంలో జన్మించిన ఆయన నేపధ్య గాయకులకు ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. నవతరం స్వరమాధురి సంస్థను ప్రారంభించి అనేకమంది వర్ధమాన, ఔత్సాహిక గాయనీ గాయకులకు ఎంతో ప్రోత్సాహం అందించారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా6,500లకు పైగా కచేరీలు నిర్వహించి,అమెరికాలో 14 పైగా ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు 2,500 పాటలు పాడి 150 ఆల్బమ్స్ చేసిన ఘనత ఆయకే దక్కుతుందన్నారు. అంతే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను, టీవీ సీరియళ్ళలో సినీ దర్శకుడిగా రాణించారని తెలిపారు. ఆయనతో తాను గత నాలుగు దశాబ్దాలుగా ప్రయాణించడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల ఎంతో సానుకూలంగా వ్యవహరించటంతో పాటు విజయవాడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. సినీ ప్రపంచంలో ఆణిముత్యాలవంటి పాటలను అందించి అందరి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారన్నారు. తొలుత జీ ఆనంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మృతిపట్ల రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మిమిక్రీ అర్టిస్టు సెల్వర్ స్టర్, ప్రముఖ గాయకులు మహ్మద్ ఖాజా మాట్లాడుతూ ఆయనతో నాలుగు దశాబ్దాలుగా తమ ప్రయాణం మరువలేనిదన్నారు. శ్రీధర్, సాయిబాబా, సినీ జర్నలిస్టు బాయన శేఖర్ బాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని వివరించారు. కేఎల్ యూనివర్శిటీ డైరెక్టర్ రాజశేఖర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, రాజేశ్వరరావు కొండా, స్సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఆల్ ఇండియా న్యూస్ పేపర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, సత్యవతి, సరస్వతి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు తదితరులు ఆయనకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *