-మన్యం వీరునికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి సందర్భంగా ముత్యాలంపాడులోని శ్రీ గోకరాజు గంగరాజు కళ్యాణవేదికలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కీర్తించారు. స్వాతంత్య్ర సమరంలో అల్లూరి జరిపిన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమని కితాబిచ్చారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే ప్రాణాలను అర్పించిన మహోజ్వల శక్తి అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన ఆ మహనీయుని నుంచి యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఆ మన్యం వీరుని ఆశయాలే ఆదర్శంగా గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. అల్లూరి పేరిట నూతన జిల్లా ఏర్పాటు ఓ చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. లంబసింగిలో అల్లూరి మ్యూజియం ఏర్పాటుకు 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో వివక్షలకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని.. అదే మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, శర్వాణీ మూర్తి, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం ఉపాధ్యక్షులు పి.వి.సుబ్బరాజు, కార్యదర్శి ఎస్.వి.సుబ్బరాజు, కోశాధికారి డి.జె.పి.ఎన్.రాజు, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ రాజు, చిరంజీవి, పిచ్చరాజు, శ్రీనివాసరాజు, కె.సుబ్బరాజు, నాయకులు నారాయణరాజు, టి.మురళికృష్ణంరాజు, టి.పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News