-ఏ గ్రూపుకీ ఎంత ఫీజు వసూలు చేయాలో అనే దానిపైన ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఫీజుల వివరముల పట్టికను బహిరంగంగా కళాశాల గేట్ ఎంట్రన్స్ లలో ప్రదర్శించాలి.
-విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలి.
-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ నూతన విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కాబోతోందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిందని, ఈ ప్రకటనను అదునుగా చూసుకొని రాష్ట్రంలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసే ప్రమాదం లేకపోలేదని ఆదివారం తమ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అన్నారు. కావున ఇంటర్మీడియట్ విద్య శాఖ బోర్డు అధికారులు ఏ గ్రూపుకి ఎంత ఫీజు వసూలు చేయాలో అనే దానిపై ఫీజుల వివరముల పట్టికను విడుదల చేయాలన్నారు. విడుదల చేయడమే కాకుండా ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఈ యొక్క ఫీజుల వివరముల పట్టికను కళాశాల గేట్ ఎంట్రన్స్ బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు స్పష్టంగా కనబడే విధంగా డిస్ప్లే ఏర్పాటు చేయాలన్నారు. బోర్డు నుంచి నూతన సంవత్సర అడ్మిషన్లు ప్రకటన రాకముందే ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగానే విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారని, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఏ విధంగా అడ్మిషన్లు పేరుతో ముందస్తు అడ్మిషన్లు ఇస్తారు అని ప్రశ్నించారు. ఆ విధంగా జరిగిన అడ్మిషన్ల పై ఇంటర్మీడియట్ బోర్డు విచారణ జరిపించి తగు చట్ట పరమైన చర్యలను తీసుకోవాలని, ప్రభుత్వం నిర్వహించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) ఆంధ్రప్రదేశ్ తరపున ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను కోరడమైనదన్నారు.
Prajavartha Online Telugu News