రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదికి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ముందస్తు చర్యల్లో భాగంగా రిలీఫ్ క్యాంపులు వద్ద త్రాగునీరు, ఆహారం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత తెలియజేశారు.
మంగళవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, సి ఎస్ సమీర్ శర్మ, హోం మంత్రి తానేటి వనిత తదితరులు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలపై వివరిస్తూ జిల్లాలో నాలుగు మండలాల్లో (సీతానగరం, నిడదవోలు, రాజమండ్రి రూరల్, అర్బన్ ) వరద ప్రభావం ఉండే అవకాశం ఉందని, అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో చేపట్ట వలసిన ముందస్తు ఏర్పాటు తో సిద్దంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే రైతులు నాట్లు నాటే దశలో ఉన్నారని, ఆయా పొలాల్లో నీరు నిలకుండ చూడడం కోసం తగిన వ్యవస్థ ను సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, సాయంత్రానికి 17 లక్షల క్యూసక్కుల వరద నీరు వొచ్చే అవకాశం ఉంటుందనే అంచనాతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియచేశారు. గోదావరి నది కి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రజలు గోదావరి ను చూడటానికి పెద్ద సంఖ్యలో ఘాట్ ల వద్దకు రావడం జరుగుతోందన్నారు. పోలీసుల అధ్వర్యంలో అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవడం తో పాటు ప్రజలకు ఘాట్ల వద్దకు రాకుండా నియంత్రణ చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడ బండ్ లకు గండ్లు పడకుండా, ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటూ, ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఫ్లడ్ మెటీరియల్ ను సిద్దం చేశామన్నారు. కోరుకొండ వద్ద ఒక కల్వర్టు ప్రమాద భరితంగా ఉందని, అక్కడ ఫ్లడ్ మెటీరియల్ తో తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరద అస్థిరమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ విపత్తు నివారణ సిబ్బందిని, సచివాలయ సిబ్బందిని నియమించామన్నారు. గతంలో లా కాకుండా ఇప్పుడు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయి లో ఎక్కువ మానవ వనరులు అందుబాటులో ఉండడం తో మరింత మెరుగ్గా తగిన చర్యలు తీసుకోవడం సులభ సాధ్యం అయిందని కలెక్టర్ వివరించారు. వాలంటీర్ ల ద్వారా ప్రజల అవసరాలు తెలుసుకుని, అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వెయ్యడం జరుగుతుందన్నారు. ముంపు కు గురి అయ్యే గ్రామాల్లో 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ఎవరు లేరని, అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉన్నామని మాధవీలత తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్ . మల్లిబాబు, ఎమ్ పిపి జ్యోత్స్న, అగ్ని మాపక సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News