స్త్రీ ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి


-మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందుబాటులోకి రావాలి
-మహిళల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ స్థాపించడం అభినందనీయం
-అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి
-మహిళలందరికీ విశిష్ట శ్రేణి వైద్య సేవలను అందించడమే లక్ష్యమని హాస్పిటల్ ఛైర్ పర్సన్ డాక్టర్ అక్కినేని మణి వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబాన్ని సంరక్షించే స్త్రీమూర్తులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లయితే, ఆమె కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, స్త్రీ ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి ముడిపడివుండని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, స్త్రీల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ను ఆమె ఆదివారం ప్రారంభించారు. భారతీనగర్ సర్వీసురోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ అక్కినేని మణి సారథ్యంలో, వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వైద్య నిపుణులు ఒకే వేదిక నుంచి సేవలందించడం హర్షణీయమని పేర్కొన్నారు. నిత్యం కుటుంబ సంరక్షణ విధుల్లో తలమునకలైవుండే మహిళలు సాధారణంగా తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారని, వ్యాధులను తొలిదశలో గుర్తించకపోవడం కారణంగా స్త్రీలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాధి తీవ్రమైన తర్వాత వైద్య చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించలేకపోతున్నామని విశ్లేషించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్సలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాము ఆరోగ్యంగా ఉంటేనే తమ కుటుంబం సంతోషంగా ఉంటుందనే విషయాన్ని మహిళలు గుర్తించాలని హితవు పలికారు. మహిళలకు అత్యున్నత వైద్య సేవలను అందించాలన్న డాక్టర్ మణి లక్ష్యం నెరవేరాలని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య సంరక్షణకు అక్కినేని హాస్పిటల్ చుక్కానిగా వర్ధిల్లుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ఛైర్ పర్సన్ డాక్టర్ అక్కినేని మణి మాట్లాడుతూ.. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒకేచోట సమగ్రమైన చికిత్సలను అందించేందుకు ‘అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్’కు రూపకల్పన చేశామన్నారు. వివిధ విభాగాలకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థ, నవీన సాంకేతిక సదుపాయాలతో ఈ హాస్పిటల్ ను తీర్చిదిద్దినట్లు వివరించారు. గైనకాలజీ చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, సంతాన సాఫల్య చికిత్సలు, డెర్మటాలజీ, రేడియాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ, ఆర్థోపెడిక్, అత్యవసర వైద్య సేవలు, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, డైటీషియన్ తదితర సేవలతో పాటు, ఆయుర్వేద వైద్య సేవలు సైతం తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పేషేంట్లకు త్వరితగతిన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలను అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని వివరించారు. పేషేంట్లు పలుమార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సంబంధిత రికార్డులను వెంటతెచ్చుకోవడం వంటి ఇబ్బందులను తొలగిస్తూ, వివిధ వైద్య విభాగాలను అనుసంధానం చేస్తూ, సమగ్రమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. టెలీ మెడిసిన్ సేవలతో పాటు, విర్చ్యువల్ కన్సల్టేషన్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. తన భర్త, ప్రఖ్యాత వైద్య నిపుణులు దివంగత డాక్టర్ అక్కినేని సుదర్శనరావు స్పూర్తితో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ను నెలకొల్పినట్లు డాక్టర్ మణి తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ పిడికిటి మధుబిందు, డాక్టర్ తెన్నేటి అపర్ణ, డాక్టర్ దావులూరి సౌమ్య, డాక్టర్ రామినేని స్ఫూర్తి, డాక్టర్ చలసాని ప్రవీణ, డాక్టర్ గుమ్మడి స్వప్న పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *