-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకి భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆత్మవిశ్వాసమే తన సంకల్పంగా వెట్టి చాకిరి నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఏలూరు లాకుల సెంటర్ వద్ద ఉక్కు మహిళ చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకి ఎమ్మెల్యే చేతులమీదుగా భూమిపూజ జరిగింది. కుల, మతాలకు అతీతంగా వెట్టి చాకిరి నిర్మూలన కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సాంఘిక, సామాజిక ఉద్యమాలకు పునాది వేసిన వీర వనిత ఐలమ్మ అని.. ఆమె ఉద్యమ పిలుపు నిజాం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె జీవితకాలం కృషి చేశారని చెప్పుకొచ్చారు. చాకలి ఐలమ్మ ఒక రజక కులానికే ప్రాతినిధ్యం వహించలేదని, ప్రతీఒక్కరి బాగు కోసం అహర్నిశలు తపన పడ్డారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన బిడ్డలను ఏకం చేసి సాయుధ రైతాంగ పోరాటాలు చేసినటువంటి ధీరశీలి ఐలమ్మ అని కీర్తించారు. ఆ వీరవనిత పేరు లేకుండా సాయుధ పోరాట చరిత్రే లేదని కితాబిచ్చారు. ఆమె జీవిత గమనంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో చిరస్మరణీయ ఘట్టాలు చోటు చేసుకున్నాయన్నారు. ఐలమ్మ ఆశయం ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమని.. భవిష్యత్తు తరాలకు దిక్సూచి అని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ డైరక్టర్ లోగిడి జయన్న, వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్, రజక సంఘం నాయకులు కందకట్ల శ్రీనివాసరావు, ఊకోటి శేషగిరిరావు, సామంతకూరి దుర్గారావు, దోనేపూడి కాశీనాథ్, వైసీపీ నాయకులు కొండాయిగుంట బలరాం, బంకా భాస్కర్, పులపా కృష్ణ, ఆర్కే, పఠాన్ భూపతి, సురేష్, తాటి శివ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News