భవిష్యత్లోనూ పుష్కలంగా విద్యుత్ సరఫరా

-24x 7 విద్యుత్ సరఫరా వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-వ్యవసాయ, వాణిజ్య , పారిశ్రామిక రంగాల ప్రగతికి బాటలు వేసేలా విద్యుత్ వ్యవస్ధ బలోపేతం
-ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు
-మిగులు విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు
-అందుకోసమే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం-2020 ప్రకటించిన ప్రభుత్వం
-33,240 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రోజెక్టుల ఏర్పాటుకు చర్యలు
-ఎస్డీఎస్టీపీఎస్, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో మరో 800 మెగావాట్ల చొప్పున రెండు కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు త్వరలో ప్రారంభం
-ఇవన్నీ పూర్తయితే ఇతర రాష్రాలకు విద్యుత్ ఎగుమతి చేయగలిగే స్థాయిని సంతరించుకోనున్న ఆంధ్రప్రదేశ్
-వ్యవసాయ విద్యుత్ సరఫరాకు పూర్తిస్థాయి భరోసా కల్పించిన ప్రభుత్వం
-విద్యుత్ రంగంలో ఏపీని నెంబర్ వన్ చేయటమే ప్రభుత్వ లక్ష్యం
-విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ఇప్పటికే నలభై వేల కోట్లు రూపాయలు అందించిన ప్రభుత్వం
-విద్యుత్ రంగం పై అవాస్తవాలను ప్రజలు విశ్వసించరు- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది . భవిష్యత్లోనూ 24x 7 విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చేయడం ద్వారా, రాష్ట్రం ఆర్థికంగా , పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం , విద్యుత్ ప్రసార పంపిణి వ్యవస్థలను బలోపేతం చేయడం, విద్యుత్ సంస్థలను ఆర్థికంగా, సాంకేతికంగా సుస్సమ్పన్నం చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్లో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగాన్ని అన్ని స్థాయిల్లో పటిష్టం చేయడం ద్వారానే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ దృష్ట్యా విద్యుత్ సంస్థలను బలోపేతం చేయటానికి అన్ని విధాలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఇప్పటికే డిస్కాములకు పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటు అందించడం ద్వారా ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని స్పష్టం చేసారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో తిరుగులేని శక్తి గా మార్చేందుకు విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు, వినియోగదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలోనూ విద్యుత్ రంగంలో సాంకేతికంగా, వాణిజ్యపరంగా వేగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. విద్యుత్ మార్కెట్ లో తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఈ దృష్ట్యా మన రాష్ట్ర విద్యుత్ రంగం సాంకేతికంగాను, ఆర్థికంగానూ అగ్రగామిగా ఉంటేనే ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోగలమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయవలసిందిగా విద్యుత్ సంస్థలకు మంత్రి ఆదేశించారు. ఒక వైపు దేశంలో బొగ్గు కొరత , విద్యుత్ మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో రాష్ట్రంలోని విద్యుత్ డిమాండ్ కూడా అనేక రేట్లు పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందన్నారు . ఈ డిమాండ్ ను అందుకుంటేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎంత డిమాండ్ పెరిగిన అందుకోగల సత్తా మన విద్యుత్ సంస్థలకు ఉందని మంత్రి పేర్కొన్నారు.
గృహ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను అందుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు విద్యుత్ సంస్థలు నిరంతరం కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 24x 7 విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు.
దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొత్త యూనిట్లను ప్రారంభించడం ద్వారా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నారన్నారు . శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) కృష్ణపట్నం రెండవ దశలో 800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి ఈ అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్ టీ టీ పీ ఎస్) 5వ దశ లో మరో 800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి , వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుందన్నారు.
అలాగే కేవలం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ పై ఆధార పడకుండా రాష్ట్రంలోని ఉన్న సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దేశంలో నెంబర్ వన్ గా మార్చేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ ఎగుమతి విధానం- 2020 ను ప్రకటించిందన్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరిన తరువాత, బయట రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు.
అలాగే 33240 మెగావాట్ల భారీ సామర్థ్యం తో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించేందుకు చర్యలు తీసుకుందన్నారు. పవన, సౌర జల విద్యుత్ ఉత్పత్తి మిశ్రమంగా ఏర్పాటు చేసే ఈ పునరుత్పాదక ఇంధన ప్రోజెక్టుల వల్ల రాష్ట్రం విద్యుత్ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందని ఆయన తెలిపారు. దేశంలోనే ఇదొక నూతన ప్రయోగమని సహజ వనరులను విద్యుత్ ఉప్త్పతి కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆయన తెలిపారు.
ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి వల్ల మన రాష్ట్రం నుంచి విద్యుత్ను వాణిజ్యపరంగా కూడా ఎగుమతి చేయవచ్చునన్నారు. అలాగే భవిష్యత్లోనూ రాష్ట్రంలో పుష్కలంగా 24x 7 విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. అంతేగాక, దీనివల్ల విద్యుత్ రంగం ఆర్థికంగా బలోపేతం అవటమేగాక , రాష్ట్రం పారిశ్రామికంగాను అభివృధి చెందుతుందని, పెధ్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు . భావితరాలకు, భావితరాల భవిష్యత్ కు బంగారు బాట వేయడంలో మన రాష్ట్ర విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని మంత్రి సంతోషం వ్యక్తం చేసారు.ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఇంధన భద్రత సాధించిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
కేవలం పారిశ్రామిక, వాణిజ్య అవసరాలే కాకుండా వ్యవసాయ రంగానికి పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే 7000 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దీనివలల్ వచ్చే 30 ఏళ్ళు పాటు వ్యవసాయ రంగానికి పగటి పూట 9 గంటల వవిద్యుత్ సరఫరాకు పూర్తి స్థాయిలో భరోసా లభించిందని మంత్రి ఆనందం వ్యక్తం చేసారు.
దీనివల్ల రాష్ట్రంలోని వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ ఉత్పాదకత అనేక రేట్లు పెరుగుతుందని , ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాదిస్తుందని , ప్రతి రైతు ముఖం పై చిరునవ్వు చూడాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం నెరవేరుతోందని మంత్రి ఆనందం వ్యక్తం చేసారు. రైతులకు వ్యవసాయ రంగానికి ఇంతటి భరోసా కలిగించిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటేనని గర్వంగా చెప్పగలనని మంత్రి పేర్కొన్నారు . ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల రాష్ట్రం లోని అన్ని రంగాలకు పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉందని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు కేవలం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడమే గాక విద్యుత్ సంస్థలను ఆర్థికంగా ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ, విద్యుత్ రంగాన్ని కాపాడుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ మార్కెట్ల లో విద్యుత్ కొనుగోలు పై ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ పేరు కూడా వచ్చిందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ తప్పిదం జరిగిందని , ఇది గమనించి వెంటనే ప్రాప్తి పోర్టల్ లో ఆంధ్ర ప్రదేశ్ పేరును తొలగించడం జరిగిందని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సాంకేతిక కారణాల వల్ల ఇటువంటివి జరగటం సహజమేనని పేర్కొన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలందరికి తెలుసు అన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీ పడరని రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తెలుసని పేర్కొన్నారు.
ఈ విషయంతో పాటు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చటం, ట్రూ అప్, ఎనర్జీ అసిస్టెంట్స్ లకు శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర అంశాలపై అవాస్తవ ప్రచారాలను ప్రజలు విశ్వసించరని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో భవిష్యత్లోను పెద్ద ఎత్తున పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ట్రాపికల్ మీటిరోలోజి ఇచ్చిన నివేదికను మంత్రి స్వాగతించారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సిఎండి ఏ పీ ట్రాన్స్కో బి శ్రీధర్, జెఎండి హెచ్ఆర్డి అడ్మిన్, ఐ పృధ్వి తేజ్, డిస్కమ్ల సిఎండిలు కె సంతోషరావు, జె పద్మా జనార్దన రెడ్డి, నెడ్క్యాప్ ఎండి, ఎస్ రమణారెడ్డి వివిధ విద్యుత్ రంగ అభివృద్ధి అంశాలను మంత్రికి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *