కొవ్వూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
వ్యవసాయ గణాంకాల ద్వారానే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తాయని రాష్ట్ర గణాంక శాఖ సంయుక్త సంచాలకులు ఉమా ప్రసాద్ అన్నారు. గురువారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతులు అధ్యక్షత వహించిన జిల్లా గణాంక అధికారి నల్లే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి మొదటి దశ వ్యవసాయ గణాంకాలను పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు సమాయత్తం కావాలన్నారు. సంయుక్త సంచాలకులు పి ఉమా ప్రసాద్, సహాయ సంచాలకులు జి.గణేష్ కృష్ణ మాట్లాడుతూ మొదటి దశలో గ్రామంలోని అన్ని సర్వే, సబ్ డివిజన్లో కమతం , హక్కుదారులు కౌలు రైతులు వివరాలతో పాటు కుల , లింగ సమాచారం సేకరించాలన్నారు. రెండవ దశలో ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం గ్రామాల్లో పంట వివరాలు , నీటివసతి, కమత వర్గీకరణ చేయాలన్నారు. మూడవ దశలో అన్ని సర్వే , సబ్ డివిజన్లో పంటల దిగుబడి కి అయ్యే మొత్తం ఖర్చు , నికరవ్యవసాయ ఉత్పత్తిని తెలుసుకోవాలి అన్నారు. రెవెన్యూ గ్రామంలోని గ్రామ రెవెన్యూ అధికారుల్ని ఎన్యూమనేటర్ గాను, మండల సహాయక గణాంక అధికారి, మండల రెవెన్యూ ఇన్సఫెక్టర్ ల పర్యవేక్షకులు గాను, మండల తాసిల్దారులు పర్యవేక్షణలో ఈ గణన జరుగుతుందని అన్నారు. నల్లే శ్రీనివాసరావు ముగిస్తూ మండలంలోని అన్ని గ్రామాలలోనూ చిన్న , మధ్య , అధిక తరహా సాగు కమతాల వివరాలు సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా ప్రణాళిక అధికారి కార్యాలయపు ఉప గణాంక అధికారి వెంకటేశ్వర రావు , ఆర్డీవో కార్యాలయ ఉప గణాంక అధికారి సోమరాజు,, జిల్లా, డివిజన్ ఉప, మండల గణాంక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News