-రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల, కడియం నర్సరీ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లను చేశాం..
-కలెక్టరు కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
సెప్టెంబరు 22 న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం లలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కారి పర్యటన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా కడియం లో సత్యదేవ్ నర్సరీ, ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో గల మోరంపూడి పై వంతెన తదితర ఎనిమిది పనులకు ఆర్ట్స్ కళాశాల వేదిక పై నుంచి శంఖుస్థాపన శిలాఫలకాన్ని కేంద్రమంత్రి గడ్కారి ఆవిష్కరించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుందన్నారు.
అనంతరం కడియం లోని సత్యదేవ్ నర్సరీ లను సందర్శిస్తారని, అక్కడ అవెన్యూ, డెకరేషన్ మొక్కల వివరాలు నర్సరీ నిర్వాహకులు చూపించడం జరుగు తుందన్నారు. జాతీయ రహదారుల పై ఏర్పాటుకు అనుకూలంగా ఉండే జాతుల మొక్కలు, వాటి పెంపకం పర్యటన లో సందర్భంగా వివరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం విజయవంతం చేసేందుకు జాతీయ రహదారుల అధికారులు, జిల్లా అధికారుల సమన్వయం చేసుకోవడం జరుగుతోందన్నారు. కడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను కలెక్టర్ అధికారులతో పరిశీలించి తగిన సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా రూట్ మ్యాప్ పై పోలీస్, రెవెన్యూ, నర్సరీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.
కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డిహెచ్ఓ. ఎమ్.రాధాకృష్ణ, తహశీల్దార్, ఎంపిడివో, సి ఐ, సత్యదేవ్ నర్సరీ నిర్వాహకులు పుల్లా ఆంజనేయులు, రాజశేఖర్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి పర్యటన వివరాలుః-
ఈనెల 22 వ తేదీన గురువారం ఉదయం 9.30 గం.లకు డిల్లీ ఎయిర్ పోర్టు నుండి బయలు దేరి ఉ.11.30 రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.50 గం.కు హెలికాప్టరు ద్వారా బయలు దేరి మ.12గం.లకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ కు చేరుకుంటారు. మ.12.10 గం.ల నుంచి 12.25 వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ద్వారా చేపడుతున్న ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. తదుపరి మ. 12.30 గం. నుంచి మ.1.30 వరకు జాతీయ రహదారుల ప్రోజెక్టులకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మ. 1.30 గం.లకు హెలికాప్టర్ ద్వారా బయలు దేరి మ. 1.45 గం.లకు కడియం నర్సరీ హెలీప్యాడ్ కు చేరుకుంటారు. తదుపరి 1.45 గం. నుంచి మ.2.20 గం. వరకు కడియం నర్సరీని సందర్శిస్తారని పాల్గొంటారు. మ. 2.30 గం. కడియం నర్సరీ హెలిప్యాడ్ నుండి బయలు దేరి గుంటూరు జిల్లాకు వెళతారు.
Prajavartha Online Telugu News