రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో ఖైదీల ఆరోగ్యం పట్ల, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతోందని జిల్లా జైళ్ల శాఖ ఎం ఆర్ రవి కిరణ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సెంట్రల్ జై ల్ ఆవరణలోని సమావేశ మందిరంలో జీ ఎస్ ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెడికల్ స్క్రీనింగ్ క్యాంపు పై అవగాహన సదస్సు, అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డి ఐ జీ .- ఎమ్ ఆర్ రవి మాట్లాడుతూ, రేపు నిర్వహించే స్క్రీనింగ్ క్యాంపు నకు హాజరై ఆసుపత్రి వర్గాలు నిర్వహించే వైద్య పరీక్షలు చేయించు కోవాలని కోరారు. చికిత్స కంటే నివారణ చర్యలు ముఖ్యమని కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేసుకుని భవిష్యత్తు లో ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని అన్నారు. వివిధ రకాలైన క్యాన్సర్ వ్యాధుల నివారణకు తగిన వైద్య పరీక్షలు చేసి నివారణ సూచనలు చెయ్యడం జరుగుతుందని అన్నారు. సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు .
సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ ఎస్. రాజారావు మాట్లాడుతూ, గతంలో రెండు సార్లు జీ ఎస్ ఎల్ వారి ద్వారా ఖైదీలకు వైద్య పరీక్షలు చేసి, మందులు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజారావు డా . గన్ని భాస్కర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అవగాహన సదస్సులో సిబ్బందికి, అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు గుండె, క్యాన్సర్, తదితర వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు వివిధ రకాల వ్యాధులు, అందుకు కారణాలు, చేసుకోవాల్సిన పరీక్షలు, అందచేస్తున్న మందుల వివరాలు వివరించారు. అనంతరం జైల్ ఆవరణలో, రహదారి మార్గంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జైల్ డిఎస్పీ ఎమ్. రాజ్ కుమార్, మహిళా జైల్ డిఎస్పీ కె. వసంత కుమారి, జీ ఎస్ ఎల్ ఆసుపత్రి వైద్యులు డా అరుణ్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది, డిప్యూటీ సివిల్ సర్జెన్ డా పి. కోమలి, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News