-టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అప్పగించాలి
-జగనన్న ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వాలి
-సీఎం రాజ్యాంగ విరుద్ధ చర్యలు
-ధర్నాకు వస్తుంటే అకారణ అరెస్టులా?
-విధానపరమైన విధానాలు కరవు
-మోదీకి జగన్ ఊడిగం: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
-ఏపీ డీజీపీ వైఖరి దుర్మార్గం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో, జగనన్న ఇళ్ల సమస్యలపై జగన్ ప్రభుత్వం దిగిరాకుంటే…ఇక ఉగాది తర్వాత ఉధృత ఉద్యమమేనని, రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకత్వం ఈ ఇళ్ల సమస్యనే ప్రధాన అజెండాతో ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. ఈ నెల 15లోగా రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని, జగనన్న ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని జగన్ సర్కారుకు సీపీఐ ఆల్టిమేటమ్ జారీజేసింది. రాష్ట్రంలో పూర్తయిన టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వాలని, జగనన్న ఇళ్లకు రూ.5లక్షలు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో సీపీఐ రాష్ట్ర సమితి గురువారం మహాధర్నా నిర్వహించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల అరెస్టులను సైతం ఎదుర్కొని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున టిడ్కో, జగన్న లబ్దిదారులు, సీపీఐ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు ధర్నా చౌక్‌కు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వివిధ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకున్న లబ్దిదారులు, పార్టీ శ్రేణులంతా…జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదిస్తూ బ్యానర్లతో ప్రదర్శనంగా ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన వహించారు.
ఈ ధర్నాలో డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం, పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ధర్నాకు వస్తున్న సీపీఐ నేత రామకృష్ణను పోలీసులు అకారణంగా అడ్డుకోవడాన్ని నారాయణ తప్పుపట్టారు. మేం ఏమన్నా డెకాయిట్‌లమా?, మాలో ఎవరైనా డెకాయిట్ చేశారా? అని ప్రశ్నించారు. డెకాయిట్లు బయట ఉంటే మంచి వాళ్ళు లోపల ఉండాలా? అని నిలదీశారు. అసలైన అవినీతి పరులు జగన్ ప్రభుత్వంలోనే ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో కట్టిన ఇళ్లను ప్రజలకు ఇవ్వాలని అడగడం తప్పా అని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు ప్రజాధనంతో నిర్మించారని, అవి ప్రజల సొత్తు అని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని ఎందుకు లబ్దిదారులకు అప్పగించడం లేదంటూ ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల పేరుతో దాదాపు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి, నేడు వారిని ఎందుకు దగా చేస్తున్నారన్నారు. నాడు తిరుపతిలో ఇళ్ల స్థలాల కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా…ఆ ఇళ్ల స్థలంతో లబ్దిదారులకు అసౌకర్యంగా ఉంటుందని, మీ ఇంట్లో కుక్కలకైనా కేటాయించే స్థలానైనా కేటాయించాలని తాను ప్రశ్నించానని గుర్తుచేశారు. వాస్తవాల్ని మాట్లాడిన నాపైన వైసీపీ మంత్రులు తీవ్ర దురుసుగా వ్యాఖ్యలు చేశారన్నారు. మీరిచ్చిన హామీని మీరే అమలు చేయాలని అడుగుతుంటే లబ్దిదారులపైన, సీపీఐ శ్రేణులపైన పోలీసులను ప్రయోగించి అణచివేయిస్తారా? అని మండిపడ్డారు. ఇంకా జగన్ ప్రభుత్వానికి ఏడాదే సమయం ఉందనీ, ఈలోగా 30లక్షల ఇళ్లు కట్టించి లబ్దిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రత్యక్ష లబ్దిదారులను కలుపుకుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సీపీఐ మద్దతిచ్చినప్పుడు మేమంతా మంచి వాళ్లమని, ఇవాళ జగన్‌ను వ్యతిరేకిస్తుంటే చెడ్డవాళ్లుగానూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ప్రతి 50 ఇళ్లకూ నలుగురుని కేటాయించారని, రాబోయే రోజుల్లో ఇందులో నలుగురు ఒక వైపు, మిగిలిన 46 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి, ఆయనను గద్దె దించుతారని హెచ్చరించారు. కేవలం సంక్షేమం పథకాలే ప్రభుత్వాలను నిలబెట్టలేవనీ, రాజకీయపరమైన, రైతాంగ విధానాలుంటాయని పేర్కొన్నారు. 2014లో గ్యాస్ ధర దాదాపు రూ.400 ఉండగా, మోదీ అధికారంలోకి వచ్చాక రూ.1150కుపైగా పెరిగిందని వివరించారు. మోడీ హయంలో వంటగ్యాస్ విపరీతంగా పెరిగిందని, దానిపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్‌కు లేకపోయిందన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే…కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రకటించి, ఇవాళ మోదీకి ఊడిగం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పదేపదే కేంద్రం అన్యాయం చేస్తుంటే ఇంకా ఎందుకు జగన్ ప్రభుత్వం కట్టుబానిసలాగా ఉందంటూ నిలదీశారు. జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా దూరమైందని, పరిశ్రమలు తెలంగాణకు తరలిపోయాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు మేలు చేసేలా జగన్ మూడు రాజధానుల నిర్ణయం ఉందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె,రామకృష్ణ మాట్లాడుతూ ధర్నాకు విజయవాడ నగర పోలీసులు అనుమతిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ముందు అనుమతిచ్చి తర్వాత ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన రాష్ట్రానికి డీజీపీనా?, లేక జగన్‌కు పెద్ద జీతగాడా? అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబరు`1 అడ్డంపెట్టుకుని డీజీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఈ జీవో వచ్చాక రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా డీజీపీ మార్చారని మండిపడ్డారు. జగనన్న ఇళ్లకు ఇచ్చేది చాలదని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అడగడానికి వస్తుంటే అరెస్టులు చేయిస్తారా? అని ధ్వజమెత్తారు. పోలీస్‌లు అధికార పార్టీకి తాబేదార్లుగా మారారని, రాష్ట్రంలో పోలీస్ అరాచకాలను ఆపేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన విజ్ఞప్తి చేశారు. మార్చి 15లోగా పూర్తయిన టిడ్కో ఇళ్లను ఇవ్వాలని, లేదంటే లబ్దిదారులతో ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సీపీఐ తరపున పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని సూచించినా ప్రభుత్వం మొండివైఖరికి పోయిందన్నారు. జగన్ ఇళ్లేమో ఎకరాల్లో ఉంటాయని, పేదలకు ఇచ్చే స్థలాలు మాత్రం సెంటు, సెంటున్నరలో ఇస్తారా?, వారి బాత్‌రూమ్‌లు ఎక్కడ కట్టుకోవాలని, పిల్లలు, పెద్దలు ఎక్కడ పడుకోవాలంటూ ప్రశ్నించారు. ఇసుక, సిమెంట్ ధరలు పెరిగిపోయాయని, మీరిచ్చే లక్షా 80వేలతో ఇళ్లు ఎలా కట్టించుకుంటారని నిలదీశారు. ఇళ్లను కట్టుకోకుంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ హెచ్చరించడాన్ని పూర్తిగా తప్పుపట్టారు. రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు ఇళ్లు సాధించే ప్రధాన అజెండాతో సీపీఐ నిలవాలని, దాని కోసం అందరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 15లోగా టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు కేటాయించాలని, జగన్న ఇళ్లకు అదనంగా రూ.5లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం దిగిరావాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఉగాది తర్వాత నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని పునరుద్ఘాటించారు.
సభకు అధ్యక్షత వహించిన జల్లి విల్సన్ మాట్లాడుతూ సీపీఐ నిత్యం పేదల పక్షాన నిలుస్తోందని, ఇళ్ల స్థలాలు, భూపోరాటంలో సీపీఐ అగ్రభాగాన నిలుస్తుందని స్పష్టంచేశారు. పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే తాము ఉద్యమిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే వారికి పక్కా ఇళ్లు కేటాయించాలన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే ఉగాది తర్వాత నుంచి లబ్దిదారులు, సీపీఐ, ప్రజాసంఘాలతో ఐక్యకార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. 2006 నుంచి నాటి ఉమ్మడి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నేతృత్వంలో వందల, వేలాది కేంద్రాల్లో నివేశసన స్థలాల ఆక్రమణ ఉద్యమాన్ని చేపట్టామని గుర్తుచేశారు. అనేక ప్రభుత్వ పోరంబోకు భూములను ఆక్రమించి వాటిని అటు సాగుకు, ఇటు ఇళ్ల స్థలాలకు ఘన చరిత్ర సీపీఐకే ఉందని నొక్కిచెప్పారు. సెంటు భూమిలో ఇళ్లను నిర్మించడం సాధ్యమేనా?, వాటిని కట్టుకోకుంటే రద్దు చేస్తామని బెదిరించడం తగునా అని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జగనన్న ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కూడా చాలబోవంటూ సాక్ష్యాత్తూ ఓ జిల్లా కలెక్టరు చెప్పారంటే, దీంతో సీపీఐ డిమాండ్ చేస్తున్న రూ.5లక్షలు ఎక్కువేమీ కాదని, ఇది న్యాయమైనదని చెప్పారు. నాడు జగన్ పాదయాత్రలో నవరత్నాల పేరుతో ప్రతి పేదవారికి ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చావని గుర్తుచేశారు. ఇరుకైన స్థలంలో ఇంటిని నిర్మిస్తే కుటుంబమంతా ఎలా ఉండాలని నిలదీశారు. టిడ్కో, జగనన్న ఇళ్లపై ప్రభుత్వం దిగిరాకుంటే ఉగాది తర్వాత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పేదలకు గూడు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఇళ్ల కోసం పేదలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, జగనన్న కాలనీలకు లక్షా 80వేలు కేటాయించి ఇళ్లు కట్టుకోవాలనుకోవడం దారుణమని, పేదలపై మరింత ఆర్థిక భారం పడుతోందని, అవి నివాసానికి అనుకూలంగా లేవన్నారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఈ క్రమంలో సీపీఐ పేదల వర్గాన నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, పి.హరినాథ్‌రెడ్డి, జి.ఈశ్వరయ్య, జంగాల అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్, ఆర్.రవీంద్రనాథ్, కె.రామాంజనేయులు, మనోహర్‌నాయుడు, పి.దుర్గాభవాని, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్.కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ టిడ్కో ఇళ్ల బాధిత లబ్దిదారుల నుంచి సేకరించిన అర్జీలను సీపీఐ నేతలు కె.నారాయణ, కె.రామకృష్ణకు విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు అందజేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రానాయక్, పెంచలయ్య, నజీర్ తదితరులు జగనన్న ఇళ్ల సమస్యలపై పాటలు ఆలపించారు. జగన్న ఇళ్ల కాలనీలు, లబ్దిదారుల ఇబ్బందులపై సంక్ష్తిప్త ప్రదర్శన చేశారు.
Prajavartha Online Telugu News