తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2022 -23 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక మేరకు వివిధ రంగాలలో లక్ష్యాల మేరకు వంద శాతం రుణాలను బ్యాంకర్లు తప్పనిసరిగా ఈ నెల మార్చి ఆఖరు లోపు మంజూరు మరియు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ (డి.ఎల్.ఆర్.సి) 2022-23 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసిక సమీక్ష సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సుభాష్ వారితో కలిసి జిల్లా అధికారులతో, ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకర్లతో వార్షిక రుణ ప్రణాళిక 2022-23 అమలుపై మూడవ త్రైమాసికానికి చెందిన వివిధ రంగాలకు చెందిన రుణాల మంజూరు, గ్రౌండింగ్ పురోగతిపై వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలలో రుణాల మంజూరు, పిఎంఈజిపీ, ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించి ఎస్బిఐ, కెనరా బ్యాంకు, ఐ.ఓ.బి, ఏపిజిబి తదితర బ్యాంకర్లు దృష్టి పెట్టి మంజూరు చేసి మార్చి 2023 చివరి లోపు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి అని అన్నారు.
తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న తోడు ఫేజ్ 6 ప్రారంభించ బోతున్నారని, సంబంధిత దరఖాస్తుల మంజూరుకు చర్యలు చేపట్టాలని అందరు బ్యాంకర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం వహించరాదు అని తెలిపారు.
ఈ సమీక్షలో తిరుపతి ఎం.పి. ఎం.గురుమూర్తి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, పథక సంచాలకులు డిఆర్డిఏ జ్యోతి, మెప్మా రాధమ్మ, ఆర్.బి.ఐ. ప్రతినిధి శ్రీమతి పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆర్.ఎం. జి.రాం ప్రసాద్, ఇండియన్ బ్యాంక్ డి.జి.ఎం. శ్రీమతి అరుణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల జిల్లా కో-ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News