Breaking News

ప్రతి అక్కచెల్లెమ్మ వ్యాపారవేత్తగా రాణించాలి

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిఒక్క పథకం ఆడపడుచుల జీవితాలలో పండుగ వాతావరణం తీసుకొస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రిక, రాజీవ్ నగర్లలో బుధవారం జరిగిన వైఎస్సార్ ఆసరా సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో అక్కచెల్లెమ్మలు చేసిన నినాదాలు హోరెత్తించాయి. మహిళల అభ్యున్నతికి అధికారంలో ఉండగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టని చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మల్లాది విష్ణు విమర్శించారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు గతంలో అనేక హామీలిచ్చి చంద్రబాబు నిలువునా మోసగించారని గుర్తుచేశారు. సున్నావడ్డీ పథకాన్ని కూడా 2016 అక్టోబర్‌ నుంచి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దీనికి గాను ఇప్పటివరకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వివరించారు. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సున్నా వడ్డీ పథకం కోసం బడ్జెట్లో రూ. 1,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

ఆర్థిక ప్రగతికి చిహ్నం వైఎస్సార్ ఆసరా
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆసరా ద్వారా అండగా నిలిచారని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో రూ.14వేల కోట్లు ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మల బకాయిలు 2019 నాటికి రూ.25,517 కోట్లకు చేరాయన్నారు. వారందరినీ అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకురావడం కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం మ‌గువ‌ల ఆర్థిక ప్రగ‌తికి చిహ్నంగా నిలిచిందన్నారు. 63 డివిజన్ కు సంబంధించి మూడవ విడత ఆసరా ద్వారా 386 గ్రూపులలోని 3,788 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. 3 కోట్ల 62 లక్షల 78 వేల 378 రూపాయల నిధులు జమ చేయగా.. 64 డివిజన్ కు సంబంధించి 280 గ్రూపులలోని 2,718 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 2 కోట్ల 66 లక్షల 98 వేల 168 రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. ఈ నగదుకు అనుబంధంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేడు ఒక్కో పొదుపు సంఘం రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు పొందుతున్నట్లు తెలిపారు. వ్యాపార రంగంలో ఒక్కసారి మనం పెట్టే పెట్టుబడి.. మన కుటుంబానికి రోజువారీ ఆదాయాన్ని సంపాదించి పెడుతుందని మల్లాది విష్ణు అన్నారు. కనుక మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని.. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని అక్కచెల్లెమ్మలకు మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు.

అనంతరం నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఓట్ల కోసం ఎన్నికల సమయంలో పథకాలు అమలు చేసేవారని విమర్శించారు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు చెందిన పలువురు మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తమకు కలుగుతున్న లబ్ధిని, వ్యాపార ఎదుగుదలను వివరించారు. అనంతరం కళాకారులను ఎమ్మెల్యే చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. తదననంతరం ఆడపడుచుకులకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీఓయూసీడీ శకుంతల, జోనల్ కమిషనర్ సృజన, సీడీఓ జగదీశ్వరి, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *