-కాలువల్లో డిసిల్టేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించండి.
-కమిషనర్ కె.దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలం ప్రారంభం కాకముందే నగరంలో ప్రధాన కాలువలు అన్నిట్లోనూ పూడిక తీత పనులు పూర్తి కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 34, 35, 40, 41 వార్డులు ఉన్న సీతంపేట, మూల గొయ్యి, ఆర్యాపురం తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, పలు వార్డుల్లో కాలువల్లో చెత్త పేరుకు పోవడానికి స్వయంగా పరిశీలించి సిబ్బంది పనితీరు, అధికారుల పర్యవేక్షణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం, వ్యాపార సంస్థలు, హోటల్స్ నుండి వ్యర్ధాలు ఎక్కువగా డ్రైన్ ల లో కలుస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీ వ్యాపార సంస్ధ, హోటల్స్ వారికి నిర్దేశించిన డస్ట్ బిన్ లను విధిగా వాడాలని స్పష్టం చేశారు. వాటిని చెత్త సేకరణ సిబ్బందికి అంద చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనబడరాదన్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. ప్రజలు ఎవ్వరూ కాలువల్లోకి చెత్తను వేయరాదని విజ్ఞప్తిచేశారు. పౌరులు తమ ఇంటి వద్ద చెత్తను డస్ట్ బిన్ లలో వేసి చెత్త సేకరణ సిబ్బందికి అందచేయాలన్నారు. మురుగు కాలువల స్థితిగతులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ నివేదికలు తనకు అందజేయాలని శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ ను ఆదేశించారు. రాత్రివేళ వీధులను శుభ్రం చేస్తున్న స్వీపింగ్ యంత్రం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంలో కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డా ఎ.వినూత్న, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News