-ప్రతి ఆర్జీకి పరిష్కారం చూపడమే స్పందన లక్ష్యం..
-ఆర్జీదారుల కోణంలో ఆలోచించండి..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ అర్జీని పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని కలెక్టరు ఎస్ డిల్లీరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్‌కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టరు డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం పై నమ్మకంతో స్పందన కార్యక్రమం ద్వారా తన సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో వస్తున్న ప్రతి ఆర్జీదారుని సమస్యను చిత్తశుద్దితో పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. అధికారులు సమస్యను నిశితంగా పరిశీలించడం ద్వారా సమస్య తేలికగా పరిష్కారం అవుతుందన్నారు. కొంత మంది అర్జీదారులు గ్రామ స్థాయిలో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కూడా స్పందనకు వస్తుంటారని అటువంటి వారికి అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా భావించి అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుంటారన్నారు. అటువంటి గ్రామీణ ప్రజలను అనునయించడం ద్వారా వారికి తమ సమస్య పరిష్కార మార్గం చూపుతుందన్నారు. స్పందనలో శాఖల వారిగా పరిశీలిస్తే ఎక్కువగా నమోదవుతున్న రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ తదితర శాఖల అధికారులు అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై దృష్టి పెడుతున్నందున అర్జీదారులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులు విధులను నిర్వర్తించాలన్నారు. స్పందన అర్జీలతో పాటు ఏపి సేవా డాష్ బోర్డు, టోల్ ఫ్రీ నెంబర్1902, అన్‌లైన్‌లోను నమోదు అవుతున్న అర్జీలను పెండిరగ్ లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నేటి స్పందనలో 118 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 44, పోలీస్ 19, యంఎయుడి 8, అగ్రికల్చర్ 6, ఏపిఎస్‌పిడిసిఎల్ 6, సర్వే అండ్ సెటిలిమెంట్ 4, విద్య 4, డిఆర్‌డిఏ 3, బిసి వెల్ఫేర్ 3, పంచాయతీరాజ్ 3, హెల్త్ 2, సోషల్ వెల్ఫేర్ 2, అటవీ 2, ఇరిగేషన్ 2, దేవదాయ శాఖ 2, పౌర సరఫరాలు 2, ఐసిడిఎస్ 2, డ్వామా 1, భూగర్భ 1, హౌసింగ్ 1, మెప్మా 1 శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందనలో అర్జీ… అర్జీదారునకు తక్షణ సాంత్వన…
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు సోమవారం స్పందన కార్యక్రమంలో పాల్గొని అనంతరం జగనన్న విద్యా కానుక కార్యక్రమం పాల్గొనేందుకు సిద్ధమౌతున్న సమయంలో తమ సమస్య చెప్పుకునేందుకు ఎన్టిఆర్ జిల్లా కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామానికి చెందిన విఆర్‌ఏ మాజాన్ తన భార్యతో కలిసి కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. మరో కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయన ఈ వృద్ధ దంపతులను చూసి ఆగిపోయారు. వారు తమ సమస్యను వివరించారు. తాను బత్తినపాడు గ్రామ శాశ్వత నౌకరు (విఆర్‌ఏ)గా పనిచేస్తున్నట్లు వివరించారు. గత నాలుగేళ్ళగా నాకు ఆరోగ్యం బాగాలేదని పక్షవాతం బారిన పడ్డానని చెప్పారు. అయితే తన స్థానంలో తన కుమారుడికి రెండు సార్లు తాత్కాలిక గ్రామ నౌకరుగా అవకాశం ఇచ్చారని, ఇదే తాత్కాలిక నియామకాన్ని శాశ్వతం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని కలెక్టర్ డిల్లీరావు వారికి హామీ ఇచ్చారు.
స్పందన కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీిడి కె.శ్రీనివాస్, డ్వామ పిడి జె. సునీత, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, డిసివో సిహెచ్ శైలజ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్ నాగమణమ్మ, మార్కెటింగ్ ఏడి కిశోర్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News