-బాల కార్మిక చట్టాలను సక్రమంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
-బాల్య వివాహాలను అరికట్టడానికి అందరు సమిష్టిగా కృషి చేయాలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాల కార్మిక చట్టం అమలు చేసి బాలలను పరిరక్షించడం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేశలి అప్పారావు తెలిపారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని ఐసిడిఎస్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ… బాల కార్మిక చట్టాలను పకడ్బందీగా అధికారులు అమలు బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఎంతైనా ఉందని అన్నారు. బాలలు వారి బాల్యాన్ని స్వేచ్చగా అనుభవించే వాతావరణం కల్పించాలని అన్నారు. బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ అందుకు కట్టుబడి ఉందని, బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చిన్న వయసులోనే బాల్య వివాహాలను చేయడం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అపాయం అని వారికి ఎదుగుదల లోపం కల పిల్లలు కలిగే అవకాశాలు ఉన్నాయని బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు. బాల్య వివాహాల నిరోధించడానికి ఏర్పాటైన మండల గ్రామ కమిటీలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ సూచనల మేరకు ఈ నెల 01 నుండి 30 వ తేదీ వరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రణాళికలు రచించుకుని విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీస్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు సమన్వయంతో కలిసి తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో సచివాలయం సిబ్బంది సంబంధిత సిబ్బందితో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు నివారణకు పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఇందులో భాగంగా 26 జిల్లాలలో బాల కార్మికులను గుర్తించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు.. ఈ రెస్క్యూ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇప్పటి వరకు 650 మందిని గుర్తించామని, 43 మంది పైన కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఎక్కడా కూడా డ్రాపౌట్ లేకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబందిత విద్యా శాఖాధికారుల పైన ఉందని తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమం కోసం సచివాలయ, వాలంటీర్ల వ్యవస్త ను తీసుకొని వచ్చినా కూడా ఇంకా బాల్య వివాహాలు బాల కార్మికులు ఉన్నారని ఈ సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి అందరూ కృషి చేయాలని అన్నారు.
నేటి తల్లి తండ్రులు వారి పిల్లలను వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ పిల్లలు డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా పర్యవేక్షణ ఉండాలని, పాఠశాలలు, కళాశాలలు దగ్గరలో ఖైనీ, గుట్కా తదితర నిషేధిత వాటి అమ్మకాలు జరగరాదని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. బలాలతో బిక్షాటన చేయించడం ఒక మాఫియా లా తయారయ్యింది అని, బాలల బిక్షాటన జరగకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలలను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. జువెనైల్ జస్టిస్ కమిటీ వారి అనుమతితో ప్రైవేట్ బాలల వసతి గృహాల నిర్వహణ నిబంధనల మేరకు ఉండాలని సూచించారు
బాలల హక్కుల పరిరక్షణ, బాలలకు స్వేచ్చగా వారి బాల్యాన్ని అనుభవించేలా అందరు అధికారులు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, సుధాకర్, షణ్ముఖ రావు, చిత్తూరు ఉమ్మడి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వసంత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News