Breaking News

డల్లాస్ లోని నాటా వేదికగా శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన డల్లాస్ లోని నాటా (NATA) మహాసభలలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం భక్తజనంతో కన్నుల పండుగలా జరిగింది. ఈ కల్యాణంలో టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి  పాల్గొన్నారు. టిటిడి నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీధర్ కొర్సపాటి అధ్యక్షతన జరిగిన నాటా మహాసభలలో కల్యాణం టీమ్ మల్లిక్, గౌతమ్ తదితరులు శ్రీవారి కల్యాణోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసారు. కల్యాణోత్సవానికి అద్భుతమైన వేదికను రూపొందించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కల్యాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీలోని టీటీడీ లోకల్ ఏరియా కమిటీ (LAC), అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, వివిధ రంగాలకు చెందిన పలువురు భారతీయ ప్రముఖులు, నాటా కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. ఆయా నగరాల్లో పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి శ్రీవారి కల్యాణం నిర్వహించాలన్న NRI ల అభ్యర్థన మేరకు గత 13 నెలలలో వివిధ దేశాలలో 30కి పైగా కల్యాణాలు జరిపించామన్నారు. సుప్రభాత సేవ నుండి కల్యాణోత్సవం క్రతువు వరకు అన్నీ శాస్త్రం ప్రకారం తిరుమలలోలాగ జరిగాయన్నారు. ఈ కల్యాణోత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే కనుక… నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోలేని ఎంతో మంది భక్తులు ఈ కల్యాణం ద్వారా స్వామీ, అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

NRI ల కోసం ఈ కార్యక్రమాలను సమన్వయము చేస్తున్న ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ ఈ సంవత్సరం కెనడా మరియు USAలలో మొత్తం 14 నగరాల్లో ఇప్పటికే 9 నగరాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు పూర్తయ్యాయని, USA లోని మరో 5 నగరాల్లో ఈ నెల 22వ తేదీ వరకు శ్రీ. వెంకటేశ్వర స్వామివారి కల్యాణాలు జరుగుతాయని అన్నారు. టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పాల్గొనడం ఆనందదాయకమన్నారు.

ముందురోజైన జూలై 1వ తేదీన అట్లాంటాలో శ్రీవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వై.వి. సుబ్బారెడ్డి సమక్షంలో జరిగిన ఈ కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా బృందం అరవింద్ గోలి, రవి కరి, సాయిరామ్ సూరపనేని, పద్మ కోగంటి మరియు పలువురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎక్కడ ఏ లోటూ రాకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది.

అలాగే… బర్మింగ్ హామ్, అలబామా (USA) లో జూన్ 30 వ తేదీన నిర్వహించిన అష్టశత కలశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వీక్షించిన భక్తుల మనసు ఆనందంతో పరవశించింది. ఈ అభిషేక మహోత్సవంలో టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ అభిషేకానికి ఆలూరి శ్రీనివాస రావు, శ్రవన్, సందీప్,  సుభాష్, సి. లావణ్య తదితరులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇప్పటివరకు నార్త్ అమెరికాలో గత 4 వారాలలో జరిగిన కల్యాణోత్సవాలకు, 30 వేల పైచిలుకు NRI భక్తులు హాజరయ్యారు. కల్యాణ ఘట్టాన్ని తిలకిస్తున్న భక్తులు సాక్షాత్తు ఆ తిరుమల వేంకటేశ్వర స్వామీ, అమ్మవార్లే ఇక్కడకు వేంచేసారన్న అనుభూతి వ్యక్తం చేసారు. ప్రతిచోట NRIలు టిటిడి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని సుబ్బారెడ్డి ని కోరారు. భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది.

స్వామివారి కల్యాణములను మరియు అష్టశత కలశాభిషేక కార్యక్రమాన్ని తితిదే నుండి AEO (Gen) శ్రీ. బి. వెంకటేశ్వర్లు, SVBC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి టైమ్ టు టైమ్ సమన్వయము చేశారు.

ఈ కార్యక్రమాలలో ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు మరియు భారతీయులు పాల్గొన్నారు. SVBC ఛానెల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *