-నంది నాటకోత్సవాల అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులదే అంతిమ నిర్ణయం.
-గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు ఎన్నో జరిగాయి.
-సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహణ
-ప్రదర్శనల వద్దకే జ్యూరీ సభ్యులు..
-వివిధ విభాగాలు మొత్తం 73 అవార్డులు ప్రధానం..
-మొత్తం ఎంట్రీలు 115, తుది జాబితాకు 38 ఎంపిక..
-ఈ ఏడాది నగదు బహుమతి మొత్తం పెంపు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నంది నాటకోత్సవ అవార్డుల ఎంపికలో సిఫార్స్ లకు తావేలేదని, ఆశ్రిత పక్షపాతానికి తావివ్వకుండ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎంపికలు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో 22వ నంది నాటకోత్సవం 2022 ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాల వివరాలను మంగళవారం పోసాని వెల్లడించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ నాటకాల ఎంపికలో జ్యూరీ సభ్యులదే అంతిమ నిర్ణయమని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నాటక ప్రదర్శనలు తిలకించిన జ్యూరీ సభ్యులు ప్రాథమిక ఎంపికలకు అర్హమైన ప్రదర్శనలను ఎంపిక చేయటం జరిగిందని తెలిపారు. వారిపై ఎటువంటి వత్తిడి లేదని, కనీసం ఒక్కరి పేరు కూడా నేను ప్రతిపాదించలేదన్నారు. జ్యూరీ సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని అన్ని విధాలుగా అర్హత ఉన్న నాటకాలను ఎంపికలు చేసి సీల్డ్ కవర్ లో మీ అందరి ముందు జ్యూరీ సభ్యులే చదవటం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అస్మదీయులకే పెద్దపీట వేయటం, అవకతవకలకు పాల్పడటం వంటి ఎన్నో అరోపణలు ఉన్నాయన్నారు. కాని ఈ ఏడాది పారదర్శకతకు పెద్దపీట వేయటం జరిగిందన్నారు. ఒక్క ఆరోపణకు తావివ్వకుండ ఎంపికలు చేయటం జరుగుతుందన్నారు. అర్హులకే అందలం అన్న మాటకు కట్టుబడినట్లు చెప్పారు. గతంలో నాకిచ్చిన అవార్డును నేను రిజక్ట్ చేయటం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ చేసి నంది అవార్డులను రద్దు చేశారని గుర్తుచేశారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా నంది అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంది నాటకోత్సవాలు 2022 అవార్డులకు ఐదు విభాగాలకు 115 ఎంట్రీలు వచ్చాయన్నారు. ఈ ఏడాది నాటక ఎంపికల కోసం ఎంట్రీలు పంపిన వారి సౌలభ్యం కోసం వారున్న ప్రాంతంలోనే ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలపటం జరిగిందన్నారు. ప్రదర్శనలను తిలకించటానికి జ్యూరీ సభ్యులు అక్కడికే వెళ్లి ఎంపికలు చేయటం జరిగిందన్నారు. ఇందుకోసం జ్యూరీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు పర్యటించారని వివరించారు. మొత్తం 5 విభాగాల్లో 115 ఎంట్రీలు వచ్చాయన్నారు. పద్య నాటక విభాగంలో 26 ఎంట్రీలు రాగా ప్రాథమిక పరిశీలనలో తుది పోటీలకు 10 ప్రదర్శనలను ఎంపిక చేయటం జరిగిందన్నారు. సాంఘిక నాటకముల విభాగంలో 22 ఎంట్రీలు రాగా తుది పోటీలకు 6 ప్రదర్శనలు, సాంఘిక నాటికల విభాగంలో 49 ఎంట్రీలు రాగా తుది పోటీలకు12 ప్రదర్శనలు, బాలల నాటికల విభాగంలో 9 ఎంట్రీలు రాగా తుది పోటీలకు 5 ప్రదర్శనలు, కళాశాల/ విశ్వవిద్యాలయ విభాగంలో 9 ఎంట్రీలు రాగా తుది పోటీలకు 5 ప్రదర్శనలు ఎంపిక చేయటం జరిగిందన్నారు. 5 విభాగాల నుంచి మొత్తం 38 ప్రదర్శనలు తుది పోటీలకు ఎంపిక చేయటం జరిగిందని వివరించారు.
జ్యూరీ సభ్యులుగా అయా రంగాల్లో విశేష అనుభవం ఉన్న ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ ఎండీ టి. విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పద్య విభాగంలో విశాఖపట్నంకు చెందిన కురిటి సత్యం నాయుడు, తెనాలికి చెందిన ఎం. కుమార్ బాబు, ఏలూరుకు చెందిన మెతుకుమల్లి సూర్యనారాయణ యాదవ్ లు జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేయటం జరిగిందన్నారు. అలాగే సాంఘిక నాటకముల విభాగం, కళాశాల/ విశ్వవిద్యాలయ నాటికల విభాగాలకు తిరుపతికి చెందిన ఆకుల మల్లేశ్వరరావు, విశాఖపట్నంకు చెందిన పి. శివ ప్రసాద్, ప్రొద్దుటూరుకు చెందిన ఎస్ఆర్ఎస్ ప్రసాద్ లు జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేయటం జరిగిందన్నరు. అదేవిధంగా సాంఘిక నాటికల విభాగం, బాలల నాటికల విభాగాలకు విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కేజీ వేణు, తిరుపతికి చెందిన దాసరి నల్లన్న, ఒంగోలుకు చెందిన పి. సుమ(సుబ్రమణ్యం)లు జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేయటం జరిగిందన్నారు.
నంది నాటకోత్సవాల 2022 కు తుది జాబితా కోసం జ్యూరీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 18 వరకు అంటే 12 రోజులు పర్యటించి స్క్రూటిని చేశారని ఎపీఎస్ఎఫ్ టీవీటీడీసీ ఎండీ టి. విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఐదు విభాగాల నుంచి తుది జాబితాకు ఎంపికైన38 ప్రదర్శనలు ఫైనల్ జ్యూరీ ముందు వాటిని ప్రదర్శించి వివిధ విభాగాల నుంచి మొత్తం 73 అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. అవార్డు సాధించిన ప్రదర్శనలకు అందించే పారితోషం మొత్తంను ఈ ఏడాది పెంచటం జరిగిందని వివరించారు. కళాకారులు, సాంకేతిక విభాగ సిబ్బందికి వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపికైన పద్య నాటకానికి రూ. 50వేలు, సోషల్ ప్లే విభాగంకు రూ. 40వేలు, సోషల్ ప్లే లెట్, బాలల నాటికల విభాగం, కళాశాల/విశ్వవిద్యాలయ విభాగంలో ఎంపికైన నాటకాలకు రూ. 25వేలు బహుమతిగా అందించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ మొదటి వారంలో నంది నాటకోత్సవం 2022 బహుమతులు ప్రధానం ఉంటుందన్నారు.
నంది నాటకోత్సవాలు 2022 ప్రాథమిక పరిశీలనలో తుది పోటీలకు ఎంపికైన వివరాలు:
పద్య నాటకముల విభాగంలో : కర్నూలుకు చెందిన లలిత కళా సమితి వారి “శ్రీ కృష్ణ కమల పాలిక”, కర్నూలుకు చెందిన కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం వారి “ఆనంద నిలయం”, హైదరబాద్ చిక్కడపల్లికి చెందిన శ్రీ కళానికేతన్ వారి “వసంతరాజీయం”, హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ కి చెందిన నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ వారి “నర్తనశాల”, ప్రొద్దుటూరుకు చెందిన సవేరా ఆర్ట్స్ వారి “శ్రీరామ పాదుకలు”, తెనాలికి చెందిన దుర్గా భవాని నాట్యమండలి వారి “శ్రీరామ భక్త తులసీదాసు”, విజయవాడకు చెందిన సంస్కార భారతి వారి “శ్రీ మాధవ వర్మ”, కాకినాడకు చెందిన శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి వారి “సీతాకళ్యాణం”, రాజాంకు చెందిన కళాసాగర్ నాటక సంక్షేమ సంఘం వారి “శ్రీకాళహస్తీశ్వర మహత్యం(భక్తకవి నక్కీర)”, విశాఖపట్నంకు చెందిన జయకళానికేతన్ వారి “శ్రీకాంత కృష్ణమాచార్య” నాటకములు తుది పోటీలకు ఎంపికయ్యాయి.
సాంఘిక నాటకముల విభాగంలో : తెనాలికి చెందిన కళల కాణాచి వారి “ఝనక్ ఝనక్ పాయల్ భాజే”, విజయవాడకు చెందిన డాక్టర్ రామన్ ఫౌండేషన్ మరియు శ్రీ సాయిబాబా నాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో “విజ్ఞాన భారతం”, గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ వారి “ఇంద్రప్రస్థం”, హైదరాబాద్ కు చెందిన శ్రీ కళానికేతన్ వారి “ఎర్రకలువ”, హైదరాబాద్ కు చెందిన మిత్రా క్రియేషన్స్ వారి “ద ఇంపోస్టర్స్”, హైదరాబాద్ కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోషియేషన్ వారి “కలనేత” నాటకములు తుది పోటీలకు ఎంపికయ్యాయి.
సాంఘిక నాటికల విభాగంలో : ప్రకాశం జిల్లా, కొప్పోలుకు చెందిన పంట క్రియేషన్స్ వారి “పక్కింటి మొగుడు”, గుంటూరు జిల్లా, కొలకలూరు కు చెందిన శ్రీ సాయి ఆర్ట్స్ వారి “గమ్యస్థానాల వైపు”, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన గంగోత్రి వారి “ఆస్తికలు”, గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ వారి “అతీతం”, గుంటూరుకు చెందిన శ్రీ సద్గురు కళానిలయం వారి “కమనీయం”, గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రసఝురి వారి “త్రిజుడు”, గుంటూరుకు చెందిన అమృతలహరి థియోటర్ ఆర్ట్స్ వారి నాన్న “నేనొచ్చేస్తా”, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ వారి “జరుగుతున్నకథ”, కరీంనగర్ కు చెందిన చైతన్య కళాభారతి వారి “చీకటి పువ్వు”, విజయవాడకు చెందిన యంగ్ థియోటర్ ఆర్గనైజేషన్స్ వారి “రాతిలో తేమ”, శ్రీకాకుళం జిల్లా బొరివంక కు చెందిన శర్వాణి గ్రామీణ్ మరియు గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారి “కొత్త పరిమళం”, విశాఖపట్నం కు చెందిన తెలుగు కళాసమితి వారి “నిశబ్దమా నీ ఖరీదెంత?” నాటికలు తుది పోటీలకు ఎంపికయ్యాయి.
బాలల నాటికల విభాగంలో : అనంతపురం కు చెందిన అరభి యూత్ కల్చరల్ అసోషియేషన్ వారి “బాధ్యత”, ఎన్టీయార్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కథనం క్రియోషన్స్ అండ్ డిఏవీ పబ్లిక్ స్కూల్ వారి “తథా బాల్యం”, విజయవాడకు చెందిన యంగ్ థియోటర్ ఆర్గనైజేషన్ వారి “మూడు ప్రశ్నలు”, విజయవాడకు చెందిన న్యూస్టార్ మోడరన్ థియోటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ వారి “ప్రపంచ తంత్రం”, విజయవాడకు చెందిన శ్రీరాం ఇంగ్లీషు మీడియం హై స్కూల్ వారి “మంచి గుణపాఠం” నాటికలు తుది పోటీలకు ఎంపికయ్యాయి.
కళాశాల/ విశ్వవిద్యాలయ నాటికల విభాగంలో : విజయవాడకు చెందిన న్యూ స్టార్ మోడరన్ థియోటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ వారి “కపిరాజు”, విజయవాడకు చెందిన ఎస్.డి.ఎన్ సిద్ధార్థ మహిళా కళాశాల వారి “ఇంకానా”, తెనాలికి చెందిన ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ అండ్ అంబేడ్కర్ మెమోరియల్ వారి “మహాభినిష్క్రమణ”, తిరుపతికి చెందిన నందనం అకాడమీ వారి “ఉద్ధంసింగ్”, అనంతపురంకు చెందిన ఎస్.ఎస్.బి.ఎన్ డిగ్రీ కళాశాల వారి “ఇంకెన్నాళ్లు..” నాటికలు తుది పోటీలకు ఎంపికయ్యాయి.
Prajavartha Online Telugu News