రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న తరగతుల వారిని మైనారిటీలుగా పరిగణిస్తామని అన్నారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992 చట్టంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ చట్టం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు (జోరాస్ట్రియన్) మరియు జైన మతాలకు వర్తిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని 29 మరియు 30 అధికరణలు మతపరమైన, సాంస్కృతిక మరియు భాషాపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షిస్తాయని, వారి వారసత్వం మరియు సంస్కృతిని సంరక్షించడానికి, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు వీలు కల్పిస్తాయని తెలిపారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992 మరియు రాజ్యాంగంలోని సంబంధిత అధికారణల గురించి అవగాహన కల్పించారు. మతం, భాష, సంస్కృతల ఆధారంగా మైనారిటీల పట్ల వివక్ష చూపించడం తగదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. మైనారిటీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు.
.
ఈ సదస్సులో కాకినాడ జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి బి. నారాయణ, ఏ. పి. స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, కాకినాడ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్, రెవెన్యూ, మైనారిటీ సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News