-ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలిస్తున్న సీఎం జగనన్న
జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అవ్వాతాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని వచ్చే జనవరి నుంచి రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కోడూరు గ్రామంలో రూ.43.6 లక్షల వ్యయంతో సచివాలయం భవనం, రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం క్రమానుగుణంగా పింఛన్లు పెంచారని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800 కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా.. జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు రూ.2,000 కోట్లకు పెరిగే అవకాశముందన్నారు. ఈ డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,33,781 మంది పింఛన్ ద్వారా లబ్ది పొందారని అన్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగనన్న సాకారం చేశారని పేర్కొన్నారు. 500లకు పైగా సేవలను సచివాలయంలో అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News