– బాధ్యతాయుత ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నత జీవితం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక అక్షరాస్యతతో ఆర్థిక సాధికారత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. ఆర్‌బీఐ-ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు (ఫిబ్రవరి 26-మార్చి 1) సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎం.శ్రీధర్, ఎల్‌డీఎం కె.ప్రియాంక, వివిధ బ్యాంకుల అధికారులతో కలిసి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఆర్‌బీఐ ఏటా అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తోందని.. సరైన ఆరంభంతో ఫైనాన్షియల్‌గా స్మార్ట్‌గా ఎదగండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కూడా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనతో ఉన్నతంగా ఎదగాలన్నారు. బ్యాంకులు ద్వారా అందుతున్న పథకాలు, సేవలను సరైన విధంగా అర్థం చేసుకొని, అవగాహన పెంపొందించుకొని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీతో వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయని.. వీటిపైనా అవగాహన పెంపొందించుకొని పథకాల ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించుకోవాలని సేవింగ్స్, బడ్జెటింగ్, సైబర్ భద్రత తదితరాలపై దృష్టిసారించాలని సూచించారు. ఆర్‌బీఐ ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాల సేవలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎంవీ నాగిరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ జీవీ రవీంద్ర, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ పి.కృపాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News