విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సాధారణ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగ నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, జాబితా నిరంతర నవీకరణ, క్రిటికల్, వనరబుల్, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ తదితర అంశాలపై నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఢిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితాలో నమోదవుతున్న అభ్యంతరాలను విచారణ నిర్వహించి పరిష్కరిస్తున్నామన్నారు. నేటి వరకు నమోదైన ఫామ్ 6,7,8 దరఖాస్తుల పరిష్కారాన్ని వివరిస్తూ ఇంకను ఫామ్ ఆరులో 3,766, ఫామ్ ఏడులో 3,205, ఫామ్ ఎనిమిదిలో 3,150 మాత్రమే పరిష్కరించవలసి ఉందని వాటిని నిర్దేశించిన గడువులో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫామ్ 6 అర్జీలు ఎన్నికల నామినేషన్ల తుది రోజు వరకు స్వీకరించడం జరుగుతుందని నామినేషన్ల ముగింపు చివరి తేదికి ముందు పది రోజుల వరకు నమోదైన వాటిని విచారణ చేసి సప్లమెంటరీ జాబితాలో నమోదుచేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో 1,781 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎన్నికల నిర్వహణకు 169 సెక్టార్ అధికారులను, 169 సెక్టార్ పోలీస్ అధికారులను, 800 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో గత సాధారణ ఎన్నికల్లో నమోదైన వివరాలతో క్రిటికల్, వనరబుల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించి జాబితాను రూపొందిస్తున్నామన్నారు. సంబంధించిన వివరాలను అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన క్రిటికల్, వనరబుల్ పోలింగ్ స్టేషన్ల వివరాలను ఆందజేయవచ్చునని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఒకే పోలింగ్ స్టేషన్లో 90 శాతం, పదిశాతం కన్నా తక్కువ ఓటింగ్ నమోదు అయినా, 75 శాతం ఒకే అభ్యర్థికి పోల్ అయినా, తదితర ఏడు రకాల పారామీటర్స్ తో పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరుగుతుందన్నారు. ఆయా వివరాలను దృష్టిలో ఉంచుకొని తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. సమావేశంలో ఇప్పటివరకు వివిధ వార్తా పత్రికలలో ప్రచురితమైన 164 ప్రతికూల వార్తలకు సంబంధించిన విచారణ పరిష్కార నివేదికను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ కృష్ణ కాంత్ పాటిల్, డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), బి. అనిల్ (టీడీపీ), అశోక్ షరన్ (ఐఎన్‌సీ), పీవీ శ్రీహరి (బీజేపీ), కె. పరమేశ్వరరావు (ఆప్), పీ. రాజశేఖర్ (వైఎస్ఆర్ సీపీ), ఎలక్షన్ సెల్ సూపరిండెంటెంట్ ఎం. దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News