-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం రిషీకొండపై రూ.450 కోట్లు వెచ్చించి రాజప్రాసాదంలా నిర్మించిన భవనాల నిర్మాణ ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో రిషీకొండకు బోడిగుండు కొట్టించి, రూ.450 కోట్లు ప్రజాధనం వెచ్చించి రాజప్రాసాదంలా భవనాలను నిర్మించింది. ఆయా భవనాలు గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నివాసముండేందుకే నిర్మించినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్మోహన్‌రెడ్డి కూడా పలుమార్లు విశాఖకు తన నివాసాన్ని మార్చుకుంటున్నట్లు చెప్పారు. ‘విశాఖపట్నమే ఎపి రాజధానియంటూ, తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే జరుగుతుందని, విశాఖ నుండే పాలన సాగిస్తానని’ ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు కూడా ప్రకటించారు. ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందడంతో రిషీకొండపై నిర్మాణాలు ప్రభుత్వానివేనంటూ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. పేద ప్రజలకు సెంటు స్థలంలో ఇళ్లు ఇచ్చి, రిషీకొండపై రాజమహల్‌ను నిర్మింపజేసుకున్న జగన్మోహన్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గతంలో రిషీకొండపై ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాటేజీలు ఉండేవి. 2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన పిదప ఆయా కాటేజీలను అర్ధాంతరంగా పడగొట్టేశారు. పర్యావరణ నియమాలు తోసిరాజని, 9.8 ఎకరాల విస్తీర్ణంలో 7 బ్లాక్‌లను నిర్మించారు. కొండకు బోడిగుండు కొట్టించి, రూ.450 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి, అనుమతులు లేకుండా రిషీకొండపై అక్రమంగా అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించారు. భవనాల నిర్మాణ కాలంలో ప్రతిపక్ష నేతలెవ్వరూ రిషీకొండ ప్రాంతంలో పర్యటించకుండా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా తెలియకుండా గ్రీన్‌మ్యాట్‌తో కప్పేశారు. ఆ భవనాల్లో అత్యంత ఖరీదైన బాత్‌టబ్‌లు, మంచాలు, 360 డిగ్రీల లైట్లు, ఆధునిక మోడళ్లలో ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వినియోగానికైతే ఇంతటి విలాసవంతమైన భవంతుల నిర్మాణం ఎందుకోసం? దాదాపు 100 కోట్ల విలువగల పర్యాటకశాఖ భవనాలను కూలదోసి, రూ.450 కోట్లతో నూతన భవనాల నిర్మాణం అవసరమా? అని ప్రశ్నిస్తున్నాం. రిషీకొండ రాజ్‌మహల్ నిర్మాణ ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలని, అక్రమంగా భవన నిర్మాణాలకు కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయా భవనాలను పర్యాటక శాఖకు అప్పగించి, ప్రభుత్వానికి ఆదాయంవచ్చే విధంగా వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News