-పరిశుభ్రత నిర్వహణ అలసత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
-కాలువ లపై నిర్మించిన కట్టడాలు ఇంటి యజమానులు తొలగించాలి
-కలెక్టర్ ప్రశాంతి
-పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం మూడు కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం
-ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తా ఆలోగా ధవలేశ్వరం పంచాయతీ పరిధిలో శానిటేషన్ పై చర్యలు పూర్తి చేయ్యాలన్ జిల్లా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం రూరల్ ఎమ్మేల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర మండల స్థాయి అధికారులతో కలిసి ధవలేశ్వరం పంచాయతీలో పర్యటించారు. రహదారులపై బురద ఉండడం తో శాసన సభ్యులతో విధుల్లో పర్యటన చేసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శి లు శానిటేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, శానిటేషన్ సిబ్బంది సేవలు పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలన్నారు. సుమారు 140 మంది పైగా శానిటేషన్ సిబ్బంది ఉన్నా పారిశుధ్యం నిర్వహణలో అలసత్వం కనిపించడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బంది హాజరు వివరాలతో కూడిన నివేదిక అందచేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎక్కడ సిబ్బంది పనిచేసిన జాడలు కనిపించడం లేదని, ఇదేనా మీ యొక్క పర్యవేక్షణ అంటూ పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.
ధవలేశ్వరం పంచాయతీ పరిధిలోని మురుగునీరు ప్రవహించే కాలువలపై ఆక్రమణలను చూసి, అటువంటి నిర్మాణాలు ఇంటి యజమానులు స్వచ్ఛందంగా తొలగించేలాగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు. పంచాయతీ ప్లానింగ్ మ్యాప్ ప్రకారం పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ప్లాన్ ను ఉల్లంఘించిన నిర్మాణాలు చేసిన వాటిని గుర్తించి, ఇందు కోసం రెండు రోజుల సమయం ఇవ్వాలని అప్పటికీ తొలగించని ఎడల, పంచాయతీ వారు వాటిని తొలగించి ఆ రుసుము వారి నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో గ్రామ ప్రజలు అధికారులకు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.
ధవలేశ్వరం గ్రామ పంచాయతీలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం మూడు కోట్ల నిధులు వ్యయంతో ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఆ మేరకు నిధులు విడుదల చేసి సత్వరం ఆ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ ఎమ్మెల్యే వెంట జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, రూరల్ ఎంపీడీవో డి శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ కే.ఎన్. జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News