మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పట్ల అవగాహన కల్పించి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని, ఇందుకోసం వివిధ కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు.
అగ్ని వీరు పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో అగ్ని వీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో, భారత వాయుసేనకు చెందిన నాన్ కమిషన్ ఆఫీసర్ ఎన్. సందీప్, జిల్లా ఉపాధి కల్పనాధికారి డి. విక్టర్ బాబు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ను కలిసి ఆ వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని వీర్ వాయు ఉద్యోగాల పట్ల ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకునే విధంగా వివిధ కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా ఉపాధి అధికారి డి. విక్టర్ బాబు మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో పనిచేసేందుకు కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంటర్మీడియట్(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)/ ఇంటర్ ఒకేషనల్. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలని తెలిపారు.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో http://agnipathvayu.cdac.in లింక్ ద్వారా జూలై 8 వ తేదీ నుండి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, అర్హత గల అవివాహిత పురుషులతో పాటు, మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.
అదే విధంగా ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది అని ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు.
Prajavartha Online Telugu News