Breaking News

ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌కు వైద్య, ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌

-ఆసుప‌త్రుల్లో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పాలి
-స‌త్ఫ‌లితాలు రాక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
-ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో మెరుగ‌వుతున్న సేవ‌ల ప‌ట్ల ప్రజాస్పంద‌న‌ను వివ‌రించిన ఎం.టి.కృష్ణ‌బాబు
-256 ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌తో వీడియో స‌మీక్ష‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి స్థాయిలో ప్ర‌భుత్వాసుప‌త్రుల ప‌నితీరుపై నిరంత‌ర స‌మీక్ష జ‌రుగుతోంద‌ని, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న అంశాల్లో అన‌తి కాలంలో సానుకూల‌త సాధించ‌కుంటే ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు బుధ‌వారంనాడు హెచ్చ‌రించారు. అమ‌రావ‌తి స‌చివాల‌యంలోని వైద్య‌, ఆరోగ్య శాఖ కార్యాల‌యం నుంచి ఆయ‌న 256 ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌భుత్వాసుప‌త్రుల సేవ‌ల నాణ్య‌త‌ను స‌మీక్షించారు.

ప్ర‌భుత్వాసుప‌త్రుల సేవ‌ల పట్ల రెండు విడ‌త‌ల్లో ఐవిఆర్ ఎస్ ద్వారా సేక‌రించిన ప్ర‌జాభిప్రాయ వివ‌రాల్ని కృష్ణ‌బాబు వివ‌రించారు. మొద‌టి ద‌ఫా అభిప్రాయ సేక‌ర‌ణ గ‌త‌నెల 27న జ‌ర‌గ్గా, రెండ‌వ అభిప్రాయ సేక‌ర‌ణ ఈ నెల 7న జ‌రిగింది. మొత్తం ఆరు అంశాల‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌ర‌గ్గా…5 అంశాల‌కు సంబంధించి ప్ర‌జ‌ల్లో సానుకూల‌త మెరుగయ్యింది. డాక్ట‌ర్లు మ‌రియు సిబ్బంది అందుబాటులో ఉండ‌డం, డాక్ట‌ర్ల ప్ర‌వ‌ర్త‌న, సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌, మందుల స‌ర‌ఫ‌రా మ‌రియు అవినీతి విష‌యాలకు సంబంధించి ప్ర‌జ‌ల్లో సానుకూల‌త వ్య‌క్త‌మ‌య్యిందని ఆయ‌న తెలిపారు.

డాక్ట‌ర్లు మ‌రియు సిబ్బంది అందుబాటులో ఉన్నార‌ని స్పందించిన రోగుల శాతం 58 నుంచి 84 శాతానికి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. డాక్ట‌ర్ల ప్ర‌వ‌ర్త‌న బాగా ఉంద‌న్న వారి సంఖ్య 65 నుంచి 82 శాతానికి, ఆసుప‌త్రుల్లో సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌ను మెచ్చుకున్న‌వారి సంఖ్య 64 శాతం నుంచి 73 శాతానికి పెరిగిన‌ట్లు ఐవిఆర్ ఎస్ స‌ర్వే వెల్ల‌డించింది. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో డాక్ట‌ర్ రాసిన మందులు ఇచ్చార‌న్న‌వారి సంఖ్య 59 శాతం నుంచి గ‌ణ‌నీయంగా 82 శాతానికి పెరిగిందని కృష్ణ‌బాబు వివ‌రించారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో అవినీతిని గ‌మ‌నించామ‌న్న వారి సంఖ్య 39 శాతం నుంచి 31 శాతానికి త‌గ్గింది.

ఈ సానుకూల‌తలపై సంతోషం వ్యక్తం చేసిన ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కృష్ణ‌బాబు ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త విష‌యంలో వ్య‌క్త‌మైన ప్ర‌జాభిప్రాయం ప‌ట్ల ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌రిశుభ్ర‌త బాగా లేద‌న్న‌వారి సంఖ్య మొద‌టి స‌ర్వేలో వెల్ల‌డైన 33 శాతం నుంచి రెండో స‌ర్వేలో 59 శాతానికి పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఈ ఐవిఆర్ ఎస్ స‌ర్వే ఫ‌లితాల్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం నాడు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించార‌ని, ప్ర‌భుత్వాసుప‌త్రుల సేవ‌ల నాణ్య‌త‌ను, ప‌రిశుభ్ర‌త‌ను మెరుప‌ర్చాల్సిన
అవ‌స‌రాన్ని నొక్కివ‌క్కాణించార‌ని కృష్ణ‌బాబు తెలిపారు. త‌మ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వాసుప‌త్రులను ముఖ్య‌మంత్రి స్వ‌యంగా సంద‌ర్శించి వాస్త‌వాల్ని గ‌మ‌నించి రోగుల అభిప్రాయాల్ని తెలుసుకోనున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ వైద్య సేవ‌ల ప‌ట్ల నిరంత‌రం జ‌రిగే అభిప్రాయ సేక‌ర‌ణ‌లో భాగంగా త‌దుప‌రి
స‌ర్వే స‌మ‌యానికి ఆసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త‌ను భారీ స్థాయిలో పెంచాల‌ని కృష్ణ‌బాబు స‌మీక్షా స‌మావేశంలో కోరారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల ప‌ట్ల ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌భావితం చేసే ప‌రిశుభ్ర‌త విష‌యంలో అన‌తికాలంలో స‌త్ఫ‌లితాలు సాధించ‌కుంటే సంబంధిత సూప‌రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబ‌డ‌తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సానుకూల ఫ‌లితాలు సాధించే దిశ‌గా సూప‌రింటెండెంట్లు స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని, రెవెన్యూ విభాగాల్లో దీర్ఘ‌కాల అనుభ‌వం ఉన్న అడ్మినిస్ట్రేట‌ర్లు వారి సామ‌ర్ధ్యాన్ని చూపాల‌ని, ఇత‌ర ఆసుప‌త్రి సిబ్బంది భాగ‌స్వామ్యంతో స‌మిష్టిగా ఉన్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణాన్ని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో నెల‌కొల్పాల‌ని కృష్ణ‌బాబు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *