గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ కు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు
బుధవారం ఏసీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పోలింగ్ అధికారులకు పంపిణీని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్న కౌంటర్లను పరిశీలించారు. మెటీరియల్ తీసుకున్న పోలింగ్ సిబ్బంది వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్, ఇతర పోలింగ్ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ కు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో బుధవారం ఉదయం నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు.ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలో శాసనమండలి ఎన్నికలకు 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, గుంటూరు జిల్లాకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు ఏసీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇతర జిల్లాల్లో అక్కడే ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోనే పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన పిఓలు, ఏపీవోలు, ఓపివోలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేసి బ్యాలెట్ బాక్సులు ,బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ మెటీరియల్ తీసుకొని వెరిఫై చేసుకొని పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళుతున్నారని తెలిపారు. శాసన మండలి ఎన్నికలకు పోలింగ్ గురువారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు జరుగుతుందన్నారు. ఓటర్లకు ఇప్పటికే 95% ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఓటర్లు ఓటు స్లిప్ తో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన 10 గుర్తింపు కార్డులను ఏదో ఒకటి తీసుకొని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడం కుదరదు అన్నారు . పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లు, స్మార్ట్ వాచీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరన్నారు. కేవలం ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు మాత్రమే సమాచారం అందించడానికి సెల్ ఫోన్లు వినియోగించడానికి అనుమతి ఉందన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పరిశ్రమలలో, వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా యాజమాన్యాలు క్యాజువల్ లీవులు, ఆలస్యపు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి డ్రై డే గా ప్రకటించి మద్యం షాపులను ముగించడం జరిగిందని, పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే మద్యం షాపులు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలను, బెదిరించటం వంటి చర్యలు చేయరాదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ప్రచారాలు చేయరాదని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లకు హాని కలిగించే చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు పోలింగ్ సిబ్బందితోపాటు ఇతర కార్యక్రమాల కోసం దాదాపు 2500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు అన్నారు. శాసనమండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఓటర్లు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, గుంటూరు రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు, మునిసిపల్ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News