Breaking News

సూర్యలంక బీచ్ లో పర్యావరణాన్ని కాపాడుతూనే పర్యాటకానికి పెద్దపీట

-బ్లూఫ్లాగ్ బీచ్ గా సూర్యలంక బీచ్ ను రూపాంతరం చెందిస్తామన్న మంత్రి దుర్గేష్
-బాపట్ల జిల్లా అవిడి గ్రామంలో వి రిసార్ట్స్ లో వాటర్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
-పర్యాటకుల భద్రతకు,అంతర్జాతీయ ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్న వి రిసార్ట్స్ యాజమాన్యానికి అభినందన
-చీరాల, బాపట్ల మధ్యలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీం 2.0 ద్వారా మంజూరైన రూ.97.52 కోట్ల నిధులతో సూర్యలంక బీచ్ లో అధునాతన సదుపాయాలు కల్పించి, మరింత సుందరంగా తీర్చిదిద్ది బ్లూఫ్లాగ్ బీచ్ గా రూపాంతరం చెందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ అవిడి గ్రామంలో వి వాటర్స్ వాటర్ పార్క్ ను ప్రారంభించారు. అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ కు స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటికే పీపీపీ విధానంలో పెట్టుబడులకు పలువురు ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికామన్నారు. అందులో భాగంగా నేడు వి రిసార్ట్స్ పేరుతో బాపట్లలో అధునాతనమైన రిసార్ట్స్ నిర్మించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాటర్ స్పోర్ట్స్ ప్రవేశపెట్టి, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నందుకు అధినేత సందీప్ ను మంత్రి దుర్గేష్ అభినందించారు. చాలా మంది రిసార్ట్స్ ఏర్పాటుకే పరిమతం అవుతారు కానీ ఇలాంటి యాక్టివిటీస్ ప్రవేశపెట్టడం అరుదు అన్నారు. ఒక రోజు కుటుంబం అంతా సంతోషంగా గడిపేలా వసతులు కల్పించడం బాగుందన్నారు. పీపీపీ విధానంలో వి రిసార్ట్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అద్భుతమైన ప్రకృతి రమణీయత కలిగిన బాపట్ల ప్రాంతంలో వి రిసార్ట్స్ ఏర్పాటు చేయడంతో మరింత శోభ చేకూరిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు ఈ రిసార్ట్స్ ను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల, చీరాల సమీపంలో ఏర్పాటు చేసిన వి- రిసార్ట్స్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో తనను భాగస్వామ్యం చేసినందుకు మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు.త్వరలోనే చీరాల-బాపట్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తామన్నారు.

గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగం అడుగంటి పోయిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు. అందుకు నిదర్శనంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సూర్యలంక బీచ్ కు రూ.97 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఈ నిధులతో సూర్యలంక బీచ్ లో పర్యావరణ విద్య, పరిశుభ్రత, టాయిలెట్స్, బట్టలు మార్చుకునే గదులు, వ్యర్థాల నిర్వహణకు విధానం తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పర్యాటకానికి పెద్దపీట వేస్తామన్నారు.తద్వారా చీరాల, బాపట్ల నియోజకవర్గంలో భారీ ఎత్తున ఉపాధి కల్పించనున్నామన్నారు. బాపట్ల, చీరాల ప్రాంతాలు పర్యాటక రంగానికి ఉపయోగపడే ప్రాంతాలని ఇటీవల జరిగిన అసెంబ్లీలో శాసనసభ్యులు నరేంద్ర వర్మ, కొండయ్యలు అడిగారని మంత్రి దుర్గేష్ అన్నారు. వాళ్లు అడిగిన 15 రోజుల్లోనే సూర్యలంక బీచ్ అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు రావడం జరిగిందన్నారు. ఇందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయశాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇతోధికంగా కృషి చేయడం జరిగిందన్నారు.అదే విధంగా తాను పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని కోరడం ..ఇలా సమిష్టి కృషితో బాపట్ల సూర్యలంక బీచ్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు.

రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పర్యాటకులు ఏదైనా ఒక ప్రాంత పర్యటనకు వస్తే రెండు మూడు రోజులు గడిపేలా మౌలిక వసతులు కల్పించి, చుట్టూ ఉన్న ప్రాంతాలను సందర్శించేలా సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో టెంపుల్ టూరిజంతో పాటు బీచ్, అగ్రి, మెడికల్, అడ్వెంచర్, స్పోర్ట్స్, వెల్ నెస్ తదితర విభిన్న టూరిజం ప్రక్రియలను ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా రాష్ట్రానికి ఆదాయంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదం కలుగుతుందన్నారు.

రాబోయే రోజుల్లో ఏ ఇజం ఉండదు టూరిజం మాత్రమే ఉంటున్న సీఎం ఆలోచనకు కార్యరూపం దాల్చుతామన్నారు.టూరిజం ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన చేపడుతామన్నారు. 2014-19లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పర్యాటక రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. 2019-24 మధ్యలో పర్యాటక రంగం కుంటుపడిందన్నారు.నాటి పర్యాటక మంత్రి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యమిచ్చారు తప్ప పర్యాటక రంగ ప్రగతిని పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం అనుక్షణం పర్యాటక రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.సీఎం చంద్రబాబు నాయుడు సూచించనట్లు రాబోయే 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 50వేల గదులు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ, చీరాల ఎమ్మెల్యే కొండయ్య, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు స్వాములు, బాపట్ల సమన్వయ కర్త శ్రీమన్నారాయణ, వి రిసార్ట్స్ అధినేత సందీప్, భాస్కర్, కుటుంబీకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *