Breaking News

11న అంగరంగ వైభవంగా.. కోదండరాముడి కళ్యాణోత్సవ ఏర్పాట్లు..    

-టిటిడి, జిల్లా అధికారుల సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సవిత
-అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం : జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప,  నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత ప్రాచీన విశిష్టత ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కళ్యానోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ఎస్. సవిత లు సంయుక్తంగా పేర్కొన్నారు.

సోమవారం ఒంటిమిట్ట టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో… జిల్లా కలెక్టర్ స. శ్రీధర్ చెరుకురి, ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, టిటిడి విజిలెన్స్ ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్డిఆర్వో విశ్వేశ్వర నాయుడు లతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ : శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాల నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు.
12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి సవిత మాట్లాడుతూ… ముఖ్యంగా కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించామన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు గ్యాలరీలను క్రమబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతిఒక్కరికీ తాగునీరు, అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చర్యలు చేపట్టామన్నారు. కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా, ఒక మధుర స్మృతిగా భక్తులు గుర్తుంచుకునేలా కల్యాణ వేదిక ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా.. అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశామన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుదీకరణ, తోరణాలు, పుష్పాలంకరణ, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టిటిడి విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ రాజులు మాట్లాడుతూ.. : టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. గతంలో నిర్వహించిన శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవాల అనుభవాలను గుర్తుంచుకొని.. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కూడా కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు టిటిడి విజిలెన్స్& సెక్యూరిటీ అధికారులు సంపూర్ణ సహకారాలు అందించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా.. ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్కింగ్ ప్రదేశాల వద్ద ప్రత్యేక పోలీసు భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వాహనల ద్వారా వచ్చే భక్తులకు, బస్సుల ద్వారా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

టీటీడీ జెఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టిటిడిలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద శ్రీవారి సేవకులను నియమిస్తామన్నారు. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టిటిడి తరపున సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు.

ఆలయ దర్శనం, కళ్యాణ వేదిక పరిశీలన :

అంతకు ముందు రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖామంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు.. ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదికను వారు పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా అపరిశీలించి కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కడప, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చిన్నయ్య, టిటిడి డిప్యూటీ ఈవో నటేష్, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, డీపీఓ రాజ్యలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపిఎస్పిడిసిఎఎల్ ఎస్ఈ రమణయ్య, డిటిసి, ఆర్టీసీ అధికారులు, టిటిడి, ఐ&పీఆర్ పిఆర్వోలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *