విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని స్వరాజ్ మైదాన్ (అంబేడ్కర్ స్మృతివనం)లోని 125 అడుగుల ఎత్తయిన డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పూల మాలలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. బాబా సాహెబ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జీవన ప్రమాణాలు పెంచేందుకు బాబా సాహెబ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆలోచనల స్ఫూర్తితో రాష్ట్రం, దేశాభివృద్ధికి సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు గొప్ప కృషిచేసిన మహనీయుడు డా. బీఆర్ అంబేడ్కర్ అని పేర్కొన్నారు. సమాజంలో మనం ఇంత స్వేచ్ఛగా, క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే దానికి రాజ్యాంగ ఔన్నత్యమే కారణమని, అలాంటి విశిష్ట రాజ్యాంగాన్ని అందించడంలో డా. బీఆర్ అంబేడ్కర్ కృషి చాలా గొప్పదని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. నివాళులు అర్పించిన వారిలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, దళిత సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News