– పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషం
– ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపేందుకే కొవ్వొత్తుల ర్యాలీ
– ఎన్ జి జి ఒ నేతలు డిఎస్ఎన్ .రెడ్డి పి. రమేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్మూకాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రతిఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని, అమాయకులైన పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషమని ఎపి ఎన్ జి ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి. సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి పి. రమేష్ లు అన్నారు.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా కావలి వాసి కీ.శే. మధుసూదనరావుగారి కుటుంబ సభ్యులు మరియు దాడిలో అసువులు బాసిన ఇతర భారతీయుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు, ముష్కరుల దాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా కలచివేసిందని.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరముందన్నారు. ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతిఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి పి. రమేష్ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి సంఘటన అమానవీయ చర్యని, ముష్కరులు దాడికి తెగబడిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్నవారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహిరంచాలన్నారు. దేశ రక్షణ, భద్రత కోసం రేయింబవళ్లు సరిహద్దుల్లో పహారా కాస్తూ ముష్కరులకు సవాళ్లు విసిరిన వీర జవాన్ల తీరును అభినందించాల్సిన అవసరముందన్నారు. నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణానికి నెలవైన కాశ్మీర్ లోయలో పర్యాటకులపై దాడికి తెగబడి అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరుల రాక్షసత్వం ప్రతిఒక్క భారతీయున్ని కలచివేస్తోందని, ముష్కరులు దాడిలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News