Breaking News

క్రమశిక్షణతోనే అద్భుత ఫలితాలు సాధ్యం

– కె.ఎల్.యూనివర్శిటీ పనితీరుకు నేటి ఫలితాలు నిదర్శనం
– 100 శాతం ప్లేస్‌మెంట్ కల్పించడం అద్భుతం
– విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
– భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధం
– కె.ఎల్.యూనివర్శిటీ ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అద్భుతమైన ఫలితాలు అత్యత్తుమమైన దూరదృష్టి, క్రమశిక్షణ, పట్టుదలతో మాత్రమే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తాడేపల్లిలోని కె.ఎల్.యూనివర్శిటీ ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. క్యాంపస్ రిక్రూట్ మెంట్లో ప్లేస్‌మెంట్ పొందిన విద్యార్ధులకు మెమెంటోలు అందించి అభినందించారు.

కె.ఎల్.యూనివర్శిటీ ఈ రోజు ఈ స్థాయి ఫలితాలు సాధించిందంటే అందుకు సంవత్సరాల తరబడి చేసిన కృషి కారణం అన్నారు. సుమారు ఆరు వేల మందికి ప్లేస్ మెంట్ కల్పించడం, అది కూడా రూ.70 లక్షల వరకు ప్యాకేజీతో ఉద్యోగాలు రావడం అద్భుతం అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఈ స్థాయి రికార్డు కలిగిన యూనివర్శిటీ ఇదొక్కటేనన్నారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. విద్యార్ధులు మార్కుల కోసం పోటీ పడడం కాకుండా స్కిల్ డెవలప్ చేసుకునేలా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. గతంలో ప్రాక్టికల్ నాలెడ్జిని దూరం చేసి కేవలం థియరీకి పరిమితం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహించాం.

గతంలో ఐటీ గురించి, విజన్ 2020 గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే చాలా మంది హేళన చేశారు. కానీ నేడు ఆ ఫలితాలు హైదరాబాద్ రూపంలో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నాడు చంద్రబాబు చూపిన మార్గం నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు విద్యార్ధులు ఐటీని శాసించే స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు విజన్ 2047 రూపొందించడంతో పాటుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించేందుకు అవసరమైన మార్గాలు చూపించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు.

చంద్రబాబు విజన్‌ గురించి తెలుసుకుని ఆదిశగా అడుగులు వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యువత కూడా ఆ మహత్కార్యంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఇక్కడున్న యువత ఉద్యోగాలు చేయడంతో పాటుగా.. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి.

గత ఐదు సంవత్సరాలు ఎదురైన విపత్కర పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. పోలవరం నిర్మాణంతో వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అడుగులు వేస్తూనే.. భవిష్యత్ నిర్మాణం దిశగా అమరావతి పనులు చేపట్టాం. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లినపుడే సరికొత్త విజయాలు సాకారమవుతాయి. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. మన వద్ద లభించే ఖనిజాలను నేరుగా ఎగుమతి చేయడం కాకుండా.. విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి మరింత ఆదాయం సముపార్జించేలా చూడాలి. అందుకోసం భూగర్భ వనరుల శాఖ మంత్రిగా నా వంతు కృషి నేను చేస్తున్నాను.

విద్యార్ధి దశలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. ఉద్యోగాలు పొందిన వారు, మెరుగైన ఉపాధి దక్కించుకున్న వారు తమ తోటివారిని కూడా ప్రోత్సహించాలి. అప్పుడే ముఖ్యమంత్రి ప్రకటించిన పి4 కార్యక్రమం విజయవంతం అవుతుంది. కె.ఎల్.యూనివర్శిటీ ఇలాంటి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

యూనివర్సిటీ నిర్వాహకులు, డైరెక్టర్లు, డీన్లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు మాట్లాడుతూ ప్లేస్మెంట్లో విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తమ యూనివర్సిటీ ఎప్పుడు సహకారం అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కె ఎల్ విద్యాసంస్థలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తూ వారిని అత్యుత్తమ ప్యాకేజీలు పొందేలా ప్రణాళిక అమలు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్లు, డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *