Breaking News

విప‌త్తు స‌మ‌యంలో స‌మ‌యస్ఫూర్తే ఆప‌ద్బాంధ‌వుడు

– భ‌య‌ప‌డ‌కుండా స‌రైన నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాలి
– విప‌త్తు నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కూ అవ‌గాహ‌న క‌ల్పించేందుకే మాక్ డ్రిల్‌
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలాంటి విప‌త్తు సంభ‌వించినా భ‌యాందోళ‌న‌ల‌కు గురికాకుండా.. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి స‌రైన నిర్ణ‌యాలు తీసుకొని త‌మ‌ను తాము ర‌క్షించుకుంటూ ఇత‌రుల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించ‌డం ముఖ్య‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఎలా స్పందించాల‌నే దానిపై ప్ర‌జ‌ల‌తో పాటు అధికారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల భాగ‌స్వామ్యంతో మాక్ డ్రిల్ నిర్వ‌హించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం విప‌త్తు స్పంద‌న‌, అగ్ని మాప‌క సేవ‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో మాక్ డ్రిల్ నిర్వ‌హించారు. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌కు ఎదురుగా అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది మొద‌లు నిచ్చెన ఆస‌రాగా భ‌వ‌నంపైకి విప‌త్తు స్పంద‌న సిబ్బంది చేరుకొని ప్ర‌మాదంలో చిక్కుకున్న వారిని కింద‌కు తీసుకొచ్చి, త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించేందుకు 108 వాహ‌నాల ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించడం, అగ్నిమాప‌క వాహ‌నం ద్వారా నీటితో మంట‌ల‌ను ఆప‌డం వ‌ర‌కు మాక్ డ్రిల్ చేశారు. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ నుంచి మంట‌లు వ‌స్తే ఎలా నియంత్రించాల‌నే అంశాన్ని డెమో ద్వారా ప్ర‌ద‌ర్శించారు. వంట నూనె ఉన్న బాండీలో మంట‌లు వ్యాపిస్తే భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే ఆ మంట‌ల‌ను ఎలా నియంత్రించాలనే విష‌యాన్ని కూడా వివ‌రించారు. త‌డి బ‌ట్ట‌, ప్లాస్టిక్ బ‌కెట్‌, పిండి వంటివాటితో మంట‌ల‌ను ఆర్పే ప‌ద్ద‌తుల‌ను వివ‌రించారు. రోడ్డు ప్ర‌మాదాల స‌మ‌యంలో రెండు వాహ‌నాలు ఢీకొని వాటి మ‌ధ్య చిక్కుకున్న వారిని ప్ర‌త్యేక ప‌రిక‌రాలు ఉప‌యోగించి బ‌య‌ట‌కు తీసే విధానాన్ని ప్ర‌ద‌ర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్‌, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు.

ప్ర‌తి అధికారికీ అవ‌గాహ‌న ముఖ్యం:
అగ్ని ప్ర‌మాదాలు, భూ కంపాలు, వ‌ర‌ద‌లు వంటి విప‌త్తుల స‌మ‌యంలో ఒక అధికారిగా సామాజిక బాధ్య‌త‌తో త‌న‌ను తాను కాపాడుకుంటూ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం ముఖ్య‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో విప‌త్తును చూసి భీతి చెంద‌కుండా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హరించి ఎలా ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడొచ్చ‌నే దానిపై మాక్ మాక్ డ్రిల్ నిర్వ‌హించి, అన్ని శాఖ‌ల అధికారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన‌ట్లు తెలిపారు. విప‌త్తు స్పంద‌న‌, అగ్ని మాప‌క శాఖ అధికారుల‌కు ఎలాగూ అవ‌గాహ‌న ఉంటుంద‌ని.. ఇదే విధంగా వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌రిశ్ర‌మ‌లు వంటి శాఖ‌ల అధికారులు కూడా స‌రైన అవ‌గాహ‌న క‌లిగియుండాల‌నే ఉద్దేశంతో మాక్ డ్రిల్ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌ల స‌మ‌యంలో గౌర‌వ ముఖ్య‌మంత్రి క‌లెక్ట‌రేట్‌లోనే ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించార‌ని.. ఆ స‌మ‌యంలో జిల్లా అధికార యంత్రాంగం విశేష సేవ‌లందించింద‌ని, ఇప్పుడు విప‌త్తు స్పంద‌న‌లో వారిలో నైపుణ్యాలు పెంచేందుకు మాక్ డ్రిల్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. అగ్నిమాప‌క‌, రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యం త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగ‌స్వామ్యంతో మాక్ డ్రిల్స్ నిర్వ‌హిస్తున్నామ‌ని, డివిజ‌న్ల‌లోనూ ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఏర్పాటుచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.
కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, జిల్లా అగ్నిమాప‌క అధికారి (డీఎఫ్‌వో) ఏవీ శంక‌ర‌రావు, స‌హాయ డీఎఫ్‌వో కె.విన‌య్‌, ఎస్ఎఫ్‌వో కె.న‌రేష్‌, క‌లెక్ట‌రేట్ ఏవో ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్ డా. కొల్లేటి ర‌మేష్‌, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్ర‌భుత్వ డిగ్రీక‌ళాశాల ఎన్‌సీసీ కోఆర్డినేట‌ర్ డా. డి.యుగంధ‌ర్, వివిధ శాఖ‌ల అధికారులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *