– నందిగామ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– కలెక్టరేట్‌లోనూ అర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19వ తేదీ సోమవారం నందిగామ డివిజన్ లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం జగ్గయ్యపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) జిల్లాస్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని నందిగామ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని విజయవాడలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాస్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోందని.. అయితే ఈసారి నందిగామ డివిజన్ ప్రజల సౌకర్యార్థం సమీపంలోనే ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు , జగ్గయ్యపేట ‘బి’ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుండి అర్జీల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. నందిగామ డివిజన్ తో పాటు మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా అర్జీలు సమర్పించవచ్చని.. విజయవాడలోని జిల్లా కలెక్టరేట్‌లో కూడా అర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎప్పటి మాదిరిగానే డివిజన్, మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.
Prajavartha Online Telugu News