విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన పంటల మద్దతు ధరలు కౌలురైతులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుంటే నామమాత్రంగా మద్దతు ధరలు పెంచడం మరోసారి రైతాంగాన్ని మోసగించడమే అవుతుందని, అత్యధికంగా సాగు చేసే వరి పంటకు కేవలం 3 శాతం మద్దతు ధరల ప్రకటించి తన బాధ్యత నుంచి తప్పుకోవడం సిగ్గుచేటుని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎ.కాటమయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్యలు కేంద్ర ప్రభుత్వం విధానాన్ని దుయ్యబట్టారు.
2025 -2026 ఖరీఫ్ సీజన్ లో పండించే 14 పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల ప్రకటించింది. అత్యధిక విస్తరణంలో సాగు చేసే పంటలకు స్వల్పంగాను,చాలా తక్కువగా సాగు చేసే పంటలకు అరకొరగా మద్దతు ధరల ప్రకటించడం చాలా దారుణం. గత ఏడాది క్వింటాల్ ధాన్యానికి పెరిగిన రూ.117లతో ప్రస్తుతం పెంచిన ధరలతో పోలిస్తే 41.02% తక్కువన్నారు. పెంచిన మద్దతు ధరలు పంటల వారిగా పరిశీలిస్తే ధాన్యానికి రూ.69, జొన్నలకు రూ.328,సజ్జలకు రూ.150, రాగులు రూ.596,మొక్కజొన్నకు రూ.175 కందులు రూ. 450,పెసలు రూ. 86, మినుములు రూ. 400,వేరుశనగ 480, పత్తి రూ.589 చొప్పున తదితర 14పంటలకు మద్దతు ధరల ప్రకటించి చేతులు దులుపుకున్నారని, రైతుల సంక్షేమం కోసం నిలబడే ప్రభుత్వమని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఈ మద్దతు ధరలు వల్ల రైతాంగాన్ని పెద్దగా ఉపయోగం లేదని, వ్యాపారస్తులు,మధ్యదళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకొని లాభాలు గడించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మద్దతు ధరలు ఉన్నాయని,ఇది కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కోసం ప్రకటించిందే కానీ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది కాదని మరోకసారి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేసిందన్నారు.
ప్రతి ఏడాది పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఏమోగానీ కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా దక్కక పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
గత ఏడాది మన రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మినుములు మద్దతు రూ.7400 ఉంటే కేవలం రూ.7000 కు మించి కొనలేదు. వేరుశనగ రూ. 6780 అంటే రూ.5,500 మాత్రమే కొన్నారు.చిరుధాన్యాలు క్వింటాలకు రూ.2500 మించి ధర పెట్టలేదు. కందులు రరూ.7550 ఉంటే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.75 కేజీలు బస్తా ధాన్యం రూ.1740కి కొనుగోలు చేయవలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా రూ.1250 నుంచి రూ.1350 బయట లోపే ధళారులకు అమ్ముకొని రైతాంగం ఎకరానికి రూ.15వేలు నష్టపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో ఏదో కొంత కొని చేతులెత్తేశారు.
డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ఫార్ములా ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధనం కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు కూడా మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరిపంటకు ఎకరానికి సగటున 26 క్వింటాలు దిగుబడి వస్తే క్వింటాల్ కు రూ. 69లు చొప్పున 26క్వింటాలకు అంటే కేవలం రూ.1792లు పెంచారని, ఈ ఏడాది ఎకరానికి సాగు ఖర్చు రూ.10 వేలు నుంచి రూ.15 వేల వరకు అదనంగా పెరుగుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులకు ఏ మాత్రం పొంతన లేదన్నారు. మద్దతు ధరల ప్రకటించిన తర్వాతే వ్యాపారస్తులు ఇన్పుట్ ధరలు పెంచి రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నారని,
పెరుగుతున్న ఇన్పుట్ ధరల నియంత్రించకుండా స్వల్పంగా మద్దతు ధరల ప్రకటించి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నామని ప్రకటించడం వట్టి బూటకం తప్ప మరొకటి కాదు.
నేడు దేశంలోగాని,రాష్ట్రంలో గాని కౌలు వ్యవసాయమే కీలకమైన పాత్ర పోషిస్తుందని,ప్రతి ఏడాది కౌలురేట్లు, పురుగుమందులు,ఎరువులు, విత్తనాలు ,వ్యవసాయ యంత్ర పరికరాలధరలు, పెట్రోల్ చార్జీలు పెరగటంతో దుక్కి దున్నే ట్రాక్టర్లు, కోత మిషన్లు,నూర్పిడిల మిషన్లు అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. సొంతంగా సాగు చేసుకుంటేనే గిట్టుబాటు కానీ ఈ పరిస్థితిలో కౌలు రైతులు నూటికి రెండు రూపాయలకు పైగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కౌలురైతులకు పెద్దగా ప్రయోజనం చే కూరదని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున పరిశీలించి సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించాలని, బయట మార్కెట్లో కూడా వ్యాపారస్తులు మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అప్పుడే ఫలితం ఉంటుందని లేకపోతే కాగితాలకే పరిమితం అవుతుందని ఎ. కాటమయ్య, పి.జమలయ్య కోరారు.
Prajavartha Online Telugu News