మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహ నిర్మాణంలో పురోగతి లేకుంటే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేయక తప్పదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందన్నారు.
గత 15 రోజులు కిందట నుండి గృహ నిర్మాణంలో చాలా మండలాల్లో అనుకున్న స్థాయిలో పురోగతి లేదన్నారు. ఈనెల 13వ తేదీన సమీక్షించినప్పుడు 910 గృహాలను పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం 412 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. మచిలీపట్నం పట్టణం, అవనిగడ్డ కోడూరు గన్నవరం చల్లపల్లి పెదపారుపూడి కృత్తివెన్ను మోపిదేవి గుడివాడ నాగాయలంక మండలాలు పురోగతిలో చాలా వెనుకబడ్డాయన్నారు.
ప్రస్తుతం జిల్లాలో గోడల(లింటల్) స్థాయిలో( ఎల్ ఎల్ )8,108 ఇల్లు, పైకప్పు స్థాయిలో (ఆర్ ఎల్) 2,148 ఇల్లు , రూఫ్ కాస్టింగ్ (ఆర్ సి) స్థాయిలో 588 ఇల్లు ఉన్నాయన్నారు. వీటిలో ఆర్ ఎల్ స్థాయిలోని ఇల్లు ఆర్ సి స్థాయికి, ఆర్సి స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణం వచ్చే సమావేశం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి కావాలన్నారు.
మరలా వచ్చే సమావేశం జూన్ నెల 13వ తేదీన నిర్వహిస్తామని ఆ తేదీ నాటికి పనితీరు మార్చుకోక నిర్లక్ష్యంగా ఉంటూ సరైన పురోగతి చూపకపోతే క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు బాధ్యులైన వారిని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ తో సహా అందరిని సస్పెండ్ చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. గృహ నిర్మాణం పై మండల ప్రత్యేక అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో పాటు వసతుల కార్యదర్శులు, గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రెండు రోజుల్లో సెంట్రింగ్ సామాగ్రి సంఘాలు మేస్త్రీలతో సమావేశం నిర్వహించి గృహ నిర్మాణ పురోగతిని సాధించాలన్నారు. గృహ నిర్మాణంలో పురోగతి చూపని వారి పై ఉదాసీన వైఖరి పనికిరాదని,వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనుటకు సంబంధిత దస్త్రాలను పంపించాలన్నారు. గత సమావేశంలో చెప్పినప్పటికీ కొందరు ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో సమీక్షలు చేయకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. గృహ నిర్మాణంలో గ్రామ వార్డు సచివాలయాల వసతుల కార్యదర్శుల సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారి నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. మార్చి 31వ తేదీతో గృహ నిర్మాణం గడువు పూర్తి అయినప్పటికీ భారత ప్రభుత్వం నుండి మరల పొడిగింపు ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ప్రస్తుతం గృహ నిర్మాణం జరుగుతోందని ఆ విషయం లబ్ధిదారులకు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు గత మార్చి 25వ తేదీన ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆ విషయం ఇప్పటివరకు చాలా చోట్ల లబ్ధిదారులకు తెలియజేయకపోవడం సరైనది కాదని ఆ విషయం ఇకనైనా వెంటనే తెలియజేసి లబ్ధిదారులను గృహాలు నిర్మించుకునేందుకు ప్రోత్సహించాలన్నారు.
వచ్చే జూన్ ఒకటో తేదీన ప్రభుత్వ సెలవు అయినందున ఈనెల 31వ తేదీ శనివారం పింఛన్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు
ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకటరావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు ,వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద కుమారు, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, మత్స్యశాఖ జేడీ నాగరాజు, పలువురు ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News