రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నీటి నిర్వహణలో నగరపాలక సంస్థ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నట్లు కేంద్ర బృంద సభ్యులు సుమన్, లక్ష్మీ నారాయణ తెలిపారు. నగరంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కంబాల చెరువు, ఇంకుడు గుంతలను గురువారం బృంద సభ్యులు పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలో నీటి నిర్వహణ పనులను ఆరవ జాతీయ జల పురస్కారానికి ఎంపిక చేయడానికి పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. జల కాలుష్య నివారణ, నీటిని పొదుపు చేయడం, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం తదితర అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపు కోసం నగరపాలక సంస్థ చేపడుతున్న పనులు అభినందనీయమన్నారు. ఈ పనులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత కేంద్రానికి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. అలాగే అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలియజేశారు. వీరితో పాటు ఏఈలు వెంకటేష్, శ్రీథర్, నగరపాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News