రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో నగరపాలక సంస్థ అధికారులతో ముంపు ప్రాంతాల సమస్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితిపై ఒక అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా హైటెక్ బస్టాండ్, తుమ్మలోవ, కృష్ణానగర్, రైల్వేస్టేషన్ రోడ్డు, వీఎల్ పురం సహా నగరంలోని 13 ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నీటిని తోడేందుకు ఉపయోగిస్తున్న డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ లు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలన్నారు. అదేవిధంగా వర్షపునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా డ్రెయినేజీలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ప్రతి వర్షాకాలంలోనూ ప్రజలు తరచూ ఇబ్బందులకు గురికాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఎస్ఈ(ఇంజనీరింగ్) ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ ఎ.వినూత్న, డీసీపీ శ్రీనివాస్, ఈఈలు మాధవి, రీటా, అలీ షేక్, సీఓసీ రవితేజ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News