విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నిరసన దీక్ష చేపట్టి నేటికీ 50 రోజులు దాటినా ప్రభుత్వం తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడు వేముల జైపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం, అలంకార్ సెంటర్ ధర్నాచౌక్‌లో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలో మోకాళ్ళపై నిరసన తెలియజేశారు. అధికారులందరికీ తమ గోడును విన్నవించుకున్నా కూడా ఖచ్చితమైన భరోసా కల్పించడంలో ఎందుకో జాప్యం జరుగుతుందని వాపోయారు. పెరిగిన రేట్లతో వచ్చే జీతాలు సరిపడక కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ నిరసన దీక్షలో పిట్టా మహేష్ బాబు, కార్మికులు, కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News